Sunday, October 7, 2012

శుభ ముహూర్తాల్లోనే కేశ ఖండన చేయండి








శుభ ముహూర్తం చూసుకుని పిల్లలకు పుట్టు వెంట్రుకలను తీయించాలని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అంటున్నారు. మగ పిల్లలకు సరిసంఖ్యలు గల మాసాల్లో పుట్టు వెంట్రుకలను తీయించాలి. అదే ఆడపిల్లల విషయంలో అయితే బేసి సంఖ్య మాసాల్లో కేశ ఖండన చేయించటం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇకపోతే కేశ ఖండనకు ఉత్తరాయణ కాలం శుభప్రదం.


శుక్లత్రయోదశి, కృష్ణ పాడ్యములు ఉభయ పక్షాల్లో పగటి కాలం కేశ ఖండన చేయవచ్చు. అదేవిధంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి వంటి తిథులు కేశ ఖండనకు శుభ తిథులు. అలాగే తదియ, త్రయోదశి, పూర్ణిమల్లో కూడా కేశఖండన చేయవచ్చు.


ఇంకా పుట్టు వెంట్రుకలను తీయటానికి సోమ, బుధ, గురు, శుక్ర వారాలు, అశ్వ, మృగ, పుష్య, హస్త, చిత్త, స్వాతి,ధనిష్ట, రేవతి, శ్రవణం వంటి నక్షత్రాల్లో ముహూర్తం పెట్టుకోవడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు.


అలాగే లగ్నకాలం కంటే శుభగ్రహ హోరకాలం చాలా ప్రాధాన్యమైనదిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే శూన్యమాసాలు, మౌఢ్యమి, కర్తరి కాలాలయందు పుట్టువెంట్రుకలు తీయటం శ్రేయస్కరం కాదు. అదేవిధంగా సంధ్యాకాలం, పర్వాలు, రాత్రికాలాల్లో కేశఖండన నిషిద్ధమని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది.