Sunday, October 28, 2012

వీర్య గ్రంథికి హోలెప్ విధానం ద్వారా చికిత్స!!







తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని ఆర్.జి స్టోన్ యూరాలజీ అండ్ లాప్రోస్కోపీ హాస్పిటల్ అధునాతన శస్త్రచికిత్స విధానం ద్వారా వీర్యగ్రంథికి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తోంది. వంద గ్రాముల కంటే ఎక్కువ బరువున్న వీర్యగ్రంథులను హోలెప్ శస్త్రచికిత్స విధానం ద్వారా చికిత్స చేస్తారు.

ఇదే అంశంపై ఆ ఆస్పత్రి హెడ్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్.విజయ్ కుమార్ గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ వీర్య గ్రంథి అనేది పురుషుల్లో మూత్ర సంచికి దిగువ భాగంలో మూత్రనాళానికి సమీపంలో వస్తుందన్నారు. ఇది సాధారణ పురుషుల్లో 20 గ్రాముల బరువును కలిగివుంటుందన్నారు.

వయస్సు పెరిగే కొద్ది పురుషులందరిలో ఈ వీర్య గ్రంథి సైజు పెరుగుతుందన్నారు. దీన్ని బెనిగన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లాసియా (బీపీహెచ్) అంటారన్నారు. ఈ వీర్యగ్రంథి సైజు పెరిగే కొద్దీ మూత్ర విసర్జన సమయంలో తీవ్రనొప్పి కలుగుతుందన్నారు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రరూపం దాల్చి ప్రమాదకర పరిస్థితికి జారుకుంటుందన్నారు.

ఈ తరహా వ్యాధితో చెన్నయ్ నగరంలో అనేక మంది బాధపడుతున్నారన్నారు. వీరిలో అవగాహన కల్పించడంతో పాటు... సులభతరమైన లేజర్ చికిత్సా విధానం ద్వారా ట్రీట్‌మెంట్ చేయవచ్చన్నారు. ఈ విధానం ద్వారా వైద్య ఖర్చులు విదేశాల్లో లక్షల్లో వసూలు చేస్తారన్నారు. కానీ, తాము 60 వేల నుంచి రూ.90 వేలుగా వసూలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించి, ఈ చికిత్సా విధానం ద్వార వీర్యగ్రంథి సమస్య నుంచి విముక్తి కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో యూరాలజీ కన్సల్టెంట్ ఎం.జీవగన్, జీఎస్. వేణుగోపాల్, జైగణేష్ తదితరులు పాల్గొన్నారు.