Sunday, October 7, 2012

జన్మకుండలి వివరాలు కావాలా?







జోతిష్యశాస్త్రంలో ప్రధానంగా జన్మకుండలి ఉంటుంది. ఈ జన్మకుండలిలో 12 గళ్ళుంటాయి. ఇవి 12 రాశులకు ప్రతీక. ప్రతి రాశి యొక్క భావం మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం వీటిగురించి తెలుసుకుందాం.

1** ప్రథమ భావం : దీనిని లగ్నం అనికూడా అంటారు. ఈ స్థానంతో వ్యక్తి యొక్క శరీరసౌష్టవం, వాత-పిత్త-కఫ త దితర లక్షణాలు, శారీరక లక్షణాలు, రంగు, రూపం, వారి ఆయుష్షు, వారి పూర్వపు స్థితి, సుఖ-దు:ఖాలు, జాతకునియొక్క ఆత్మవిశ్వాసం, అహంకారం, మానసిక భావాలు మొదలైనవి తెలుస్తాయి.

2** ద్వితీయ భావం : దీనిని ధన భావం అనికూడా అంటారు. దీంతో వ్యక్తి (జాతకుని) యొక్క ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితి, కళ్ళు, వాక్కు, ఆహారపానీయాలు, వారి ప్రారంభిక చదువు, సంపద మొదలైనవాటిగురించి తెలుస్తాయి.

3** తృతీయ భావం : ఇది జాతకుని పరాక్రమం, వారియొక్క బలం, వారి తరపున చిన్న తమ్ముడు-చెల్లెలు, నౌకర్లు, ధైర్యం, కంఠం, శ్రవణం, భుజాలు, చేతులు మొదలైనవాటిగురించి తెలుపుతుంది.

4** చతుర్థ భావం : ఇది జాతకుని యొక్క మాతృస్థానాన్ని సూచిస్తుంది. దీంతో జాతకుని తల్లి ఆరోగ్యం, ఆమె యొక్క సుఖం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, తోటలు, భూమి-సంపద, మిత్రులు, ఛాతీ, ఉదర సంబంధిత రోగాలు, వారి మానసిక పరిస్థితి మొదలైనవాటి గురించి చెబుతుంది.

5** పంచమ భావం : ఇది జాతకుని సంతాన భాగ్యంగురించి తెలుపుతుంది. పిల్లల ద్వారా లభించే సుఖం, విద్యాభివృద్ధి, ఉన్నత చదువులు, వినయ విధేయతలు, దేశభక్తి, జీర్ణక్రియ, కళలు, రహస్య శాస్త్రాలపట్ల ఇష్టం, ఆకస్మిక ధనలాభం, ప్రేమ వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగం మొదలైన వాటిగురించిన విషయాలు తెలుస్తాయి.

6** షష్టమ భావం : దీని ద్వారా శత్రువులు, రోగాలగురించి తెలుపుతుంది. ఈ జాతకునికి శత్రువులు, రోగాలు, భయం, ఒత్తిడి, కలహాలు, అత్త-మామల యొక్క సుఖం, జననాంగాల రోగాలు మొదలైనవాటి గురించి వివరిస్తుంది. 
 
7** సప్తమ భావం : వివాహ సౌఖ్యం, పడక సుఖం, జీవిత భాగస్వామియొక్క స్వభావం, వ్యాపారం, భాగస్వాములు, కోర్టు వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు మొదలైనవాటిగురించి చెబుతుంది. దీనిని వివాహ స్థానం అనికూడా అంటారు.

8** అష్టమ భావం : ఇది జాతకుని యొక్క మృత్యువుగురించి తెలుపుతుంది. దీంతో ఆయుష్షు నిర్ధారణ, దు:ఖం, ఆర్థిక స్థితి, మానసిక పరమైన కష్టాలు, జననాంగాల వికారాలు, అనుకోకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల గురించి తెలుపుతుంది.

9** నవమి భావం : ఇది జాతకుని భాగ్య స్థానం. ఈ భావం వ్యక్తియొక్క ఆధ్యాత్మిక ప్రగతి, భాగ్యోదయం, బుద్ధి, గురువు, విదేశీయానం, రచయిత అయ్యే సూచనలు, తీర్థయాత్రలు, సోదరుని భార్యగురించి, రెండవ వివాహం గురించిన వ్యవహారాలు మొదలైనవాటి గురించి తెలుస్తాయి.

10** దశమ భావం : దీనిని కర్మ స్థానం అంటారు. దీంతో పదవులు, ప్రతిష్టలు, యజమాని తత్వం, సమాజిక గౌరవం, జాతకునియొక్క కార్యదక్షత, తండ్రి సుఖం, ఉద్యోగం, పని, చట్టాల ద్వారా లాభాలు, మోకాలి నొప్పులు, అత్తగారు మొదలైనవారిగురించిన వివరాలు తెలుస్తాయి.

11** ఏకాదశి భావం : దీనిని లాభ భావం అనికూడా అంటారు. దీంతో మిత్రులు, కోడలు-అల్లుళ్ళు, పురస్కారాలు, లాభాలు, ఆదాయ వ్యవహారాలగురించి తెలుపుతుంది.

12** ద్వాదశ భావం : ఇది జాతకుని ఖర్చుగురించి తెలుపుతుంది. దీంతో జాతకుని అప్పులు, నష్టాలు, విదేశీ ప్రయాణం, సన్యాసం, అనైతిక వ్యవహారాలు, గుప్తశత్రువులు, పడక సుఖం, ఆత్మహత్య, కారాగారశిక్ష, తదితరాలగురించి చెబుతుందంటున్నారు జ్యోతిష్యులు.