Friday, March 22, 2013

కర్తవ్యమే భవిష్యత్ సూచిక ....!?








రోడ్డుపై వెళ్తున్న ఓ బాటసారి హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితిలో అలాగే కూలబడ్డాడు. అయితే ఆ దారిలో వెళ్తున్న ఏ ఒక్కరు కూడా అతన్ని సమీపించేందుకు ప్రయత్నించలేదు. తమ పనులు తాము చూసుకోసాగారు. అందులో కొంతమందేమో బాగా తాగి పడిపోయాడని భావించారు.

అయితే చివరగా అటువైపే వెళ్తున్న ఓ సాధారణ వ్యక్తి అతగాడి పరిస్థితికి జాలిపడ్డాడు. అతడిని సమీపించి అతని నాడిని పరీక్షించి ముఖం మీద నీళ్లు చల్లి, ఓ గుక్కెడు నీళ్లు తాగించాడు. కాసేపటికి సొమ్మసిల్లి పడిపోయిన బాటసారికి తెలివొచ్చింది. వెంటనే తనను కాపాడిన వ్యక్తికి పదేపదే ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

సరైన సమయంలో ఆదుకున్నందుకు గాను తగినంత బహుమతి కోరాల్సిందిగా సూచించాడు బాటసారి. నేను మీకు ఏమి చేయాలో దయచేసి చెప్పాల్సిందిగా తనకు సాయం చేసిన వ్యక్తిని మళ్లీ అడిగాడు. దానికా వ్యక్తి నేను డబ్బు కోసమో లేదా ఏ స్వలాభం కోసమో మీకు సాయం చేయలేదని సావధానంగా సమాధానమిచ్చాడు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ పని చేశానని వివరించాడు.


కానీ బాటసారి మాత్రం వదలలేదు. ప్రతిఫలంగా ఏదో తీసుకోందే తన మనసు తృప్తి చెందదని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఇలా అన్నాడు. "ప్రకృతిని ఓ సారి చూడండి, అద్భుతమైన వృక్షాలు, అందమైన పక్షులు, పచ్చటి ఆకులు, నీలిరంగులోని ఆకాశాన్ని చూడండి. అవి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతృప్తినిస్తాయి. కానీ ప్రతిఫలంగా అవి ఏమీ తీసుకోవు. నిజంగా మీరు నాకు ప్రతిఫలం ఇవ్వదలుచుకుంటే... ఇదే విధమైన సేవను మరొకరికి అవసరమైనప్పుడు చేయాల"ని బాటసారికి సూచించాడు. మీరు నాకిచ్చే ప్రతిఫలం అదే అని తెలిపాడు.

ఆ మాటలకు విస్తుపోయి చూసిన ఆ బాటసారి కనీసం పేరైనా చెప్పాలని ఆ వ్యక్తిని కోరాడు. "సేవకులకు భగవద్గీతలో ఎలాంటి పేరు లేదు. నేనెవరు.. నా పేరేంటి అన్నది ఇక్కడ విషయం కాదు. మీకు సాయం చేసే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది అది చాలు" అని ఆ బాటసారికి చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.

భగవద్గీతలోని కర్మయోగంలో ఈ అంశాన్ని పార్థుడికి శ్రీకృష్ణుడు బోధించడం తెలిసిందే కదా. దీని అర్ధం... ఎలాంటి సంబంధాలు లేకున్నా... ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాలను స్వచ్ఛందంగా నిర్వర్తించాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే.. వారి వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నియంత్రించవచ్చు. కనుక కర్తవ్యమే భవిష్యత్ సూచిక.