Saturday, October 13, 2012

కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఏం చేయాలంటే!?








కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజున మంచి కార్యాలు చేపట్టాలి. ఇతరులకు దానం చెయ్యడం, భగవదారాధన చేయడం శుభఫలితాలనిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దైవపూజ చెయ్యని దేహం ప్రాణంలేని శరీరానికి సమానం. దైవ సంబంధం లేని వృధా మాటలు నక్కల ఊళలకు సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుచేత కొత్త సంవత్సరం పుట్టుకను వేడుకగా జరుపుకోవడంతో పాటు భగవదారాధన చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా సత్ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న జనవరి ఒకటో తేదీన పరిశుభ్రమైన నీరు, కుంకుమపువ్వు, పచ్చ కర్పూరం కలిపి దానితో మీకు ఇష్ట దైవమైన భగవంతునికి అభిషేకం చెయ్యడం ఉత్తమం.

ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరకురసం, కొబ్బరిబొండాంనీరు, చందనం వంటి వాటితోనూ అభిషేకం చేయించవచ్చు. అభిషేకం తర్వాత పూజకు పువ్వులతో అర్చన చేయించాలి. అలాగే ఇళ్లళ్లో అన్నం, పళ్లు, కొబ్బరికాయ నివేదనం చేసి తాంబులం, కర్పూర నీరాజనం చెయ్యాలి.

ఆలయాల్లో అభిషేకం, పూజలు పూర్తయ్యాక ఆలయాన్ని మూడుసార్లు ప్రదక్షిణం చెయ్యడం, ఆ దేవుడితి సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు గానం చేయాలి. అనంతరం మీకు వీలైనంత ఇతరులకు దానం చెయ్యాలి. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున చేసే వారికి ఆర్థిక వృద్ధి, వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.