Tuesday, October 9, 2012

నవగ్రహాల్లో శనిభగవానుడిని మీరెలా నమస్కరిస్తున్నారు?







నవగ్రహాల్లో శని భగవానుడికి మీరెలా నమస్కరిస్తున్నారు. శని భగవానుడికి ప్రత్యక్షంగా నిలబడి నమస్కరిస్తున్నారా? అయితే అది మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏదైనా ఆలయంలో గల నవగ్రహాలను 9సార్లు ప్రదక్షిణ చేసి, అనంతరం శనిగ్రహానికి నేరుగా నిలబడి తలవంచి నమస్కరించడం కూడదు. శనిగ్రహం మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు నమస్కరిస్తే.. శనిగ్రహ ప్రభావంచే దుష్పలితాలు తప్పవని పండితులు అంటున్నారు.

ఇంకా నవగ్రహ ప్రదక్షణ చేసేటప్పుడు ఏ గ్రహాన్ని ముట్టుకోకుండా.. చేతితో ఏ విగ్రహాన్ని తాకకుండా ప్రదక్షణ చేయడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా శనిగ్రహానికి నేరుగా నిలబడి నమస్కరిస్తే ఆ గ్రహ ప్రభావంచే అశుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే.. నవగ్రహాల్లో శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూర్వం శ్రీలంకను పరిపాలించిన రావణాసురుడు తన బలపరాక్రమాలచే దేవతలను మరియు నవగ్రహాలను జయించాడు. ఇందులో నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసి, వాటిపై నడవటం చేశాడు. దీన్ని గమనించిన నారదమహాముని రావణాసురుడి అహంకారానికి నిర్మూలించాలని భావించాడు.

ఈ క్రమంలో "ఓ రావణాసురా.. నీవు నిజమైన బలపరాక్రమశాలి అయితే నవగ్రహాలను బోల్తాపడేసి నడిచిపోవడం గాకుండా.. వారిని సాష్టాంగ పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకోవచ్చు కదా..!" అన్నాడు. నారదుని మాట విన్న రావణాసురుడు నవగ్రహాలను బోల్తా పడుకోబెట్టకుండా తనవైపు చూసేలా పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకున్నాడు.

ఇలా రావణాసురుడు ప్రత్యక్షంగా శనిగ్రహాన్ని చూడటం ద్వారా అప్పటినుంచి ఆతనికి చెడుకాలం ఆరంభమైంది. ఇది జరిగిన తర్వాతే రామునిచే రావణాసురుడు హతుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనిభగవానుడిని నమస్కరించే సమయాల్లో ఆయనకు ప్రత్యక్షంగా గాకుండా పక్కకు నిలబడి నమస్కరించడం చేయాలని పురోహితులు చెబుతున్నారు.