Wednesday, February 9, 2011

సుదీర్ఘ ప్రయాణాలకు మంచి రోజు చూసుకోండి ....!!!







సుదూర ప్రాంతాలకు వెళ్లేటపుడు మంచి చెడులు చూసి బయలు దేరమని మన పెద్దలు చెబుతుంటారు. సోమ, బుధ, గురు, శుక్ర వారాలు ప్రయాణానికి శుభప్రదాలని జ్యోతిష్కులు అంటున్నారు.

అదేవిధంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలు దేరటం శ్రేయస్కరం. 

అదే విధంగా శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణం కూడదు.

ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు.

ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారములు పాడ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదని జ్యోతిష్య శాస్తం చెబుతోంది.

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందుచేత ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.