Saturday, July 7, 2012

అక్షయ తృతీయ నాడు 12 రాశుల జాతకులు చేయాల్సినవి...!!







పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా, సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఓ పౌరాణికడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు స్వల్ప దానమైననను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని, ఆ రోజున గంగలో పుణ్య స్నానమాచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తంబూలాదులతో దానమచ్చాడు.

అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మలో ఆతడు కుశావతీనగరమునకు రాజుగా జన్మించెను. రాజుగా జన్మించినప్పటికీ అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, ధనధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే కానీ తరుగలేదట. అందువల్లనే అక్షయ తృతీయ నాడు పితృదేవల పూజ చేయడంతో పాటు ఇతరులకు దానం చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

అలాగే అక్షయ తృతీయ నాడు 12 రాశులకు చెందిన జాతకులు ఏయే దేవతలను పూజించాలంటే..!? మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీనరాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.