Friday, July 6, 2012

శుభ శకునములు ఏంటో మీకు తెలుసా...!!?








కార్యార్థమై బైలుదేరినప్పుడు గాని, ప్రయాణమైపోవునప్పుడు గానీ, ఇతర విషయములందు గానీ ఈ క్రింది శకునములు ఎదురగుట వలన శుభఫలప్రాప్తి జరిగి కార్యసిద్ధి చేకూరగలదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సువాసిని అనగా ముత్తయిదవ స్త్రీ ఎదురగుట వలన సత్వర కార్యసిద్ధి, ఉత్సాహము కలుగగలవు. కన్యక శకునమైన కార్యానుకూలత, మిత్ర సహకారం, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురైతే పూజ్యత, గౌరవము, శూద్రుడు ఎదురైతే అభీష్టసిద్ధి చేకూరగలదు.

మంగళవాద్యములు, ఘంటానాదములు, జయ శబ్ధములతో కార్యదిగ్విజయము, ఇష్టవస్తులాభము కలుగగలదు. ఫలము, పుష్పములు ఎదురైన- విఘ్నములు తొలగి విజయప్రాప్తి జరుగుతుంది. ఛత్ర-చామరములు శకునమైన తలచిన పనలు నెరవేరుట ఉద్యోగ ప్రాప్తి లభించును. గుర్రము ఎదురైన శత్రునాశనము, ఏనుగు ఎదురుపడిన పూజ్యత గౌరవము లభిస్తుంది.

పూర్ణజలకుంభములు శకునమైన సంపూర్ణ సుఖభోగములు కలుగును. చెరకు, అన్నము, మాంసము, పాలు, పెరుగు, తేనె అనునవి శకునములైతే తృప్తి, కృషి ఫలితమునందు లాభము కలుగును.

మండుచున్న అగ్ని (పొగలేనిది) శకునమైన యశస్సు, కీర్తి కలుగగలవు. చలువ వస్త్రములు ఎదురైన లేక రేవు నుంచి వచ్చు చాకలి ఎదురైనను శుభము, క్షేమము కలుగగలవు. అక్షతలు ఇతర మంగళద్రవ్యములు ఎదురువచ్చిన బంధుపూజ్యత, కుటుంబక్షేమము కలుగును. వీణ, మద్దెల, శంఖములాంటి వాద్యపరికరములు శకునమైన ఎల్లవేళలా విజయం కలుగును. నూతనముగా వివాహమైన వధూవరులు ఎదురువచ్చిన జీవితంలో ఉచ్ఛస్థితి కనువైన మార్గములు సమకూరగలవు.

చల్లని పిల్లగాలులు ఎదురుగా వచ్చి ఇష్టసిద్ధి, కార్యసాఫల్యత. సామాన్యమైన గాలికెరటం వెనుకగా వచ్చిన యెడల నష్ట ద్రవ్యలాభము ఊహాతీతమైన మార్పులు కలుగును. కోడి, కుక్క, నక్కలాంటివి కుడి నుండి ఎడమ ప్రక్కకుపోయినట్లైతే అనుకూలత, మంగళప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.