Monday, April 8, 2013

ఏ పుష్పాలతో దేవతలను పూజిస్తున్నారు.....!?







దైవపూజకు మనమెన్నో పవిత్రమైన వస్తువులను వాడుతూ ఉంటాం. అందులో పువ్వులు, అగరబత్తీలు, సుగంధద్రవ్యాలైన చందనం వంటి ఇతరత్రా సామగ్రిని ఉపయోగించడం పరిపాటి.

ఇంకా దేవతలను పూజించే సమయాల్లో పుష్పాలతో అల్లిన మాలలు, లేదా విడి పుష్పాలతోనూ అర్చిస్తాం. అలాగే దేవతలకు ప్రీతికరమైన నైవేద్యములను కూడా సమర్పించుకుంటూ ఉంటాం.

అయితే నిష్ఠతో మనసారా ధ్యానించి వివిధ రకాలైన పుష్పాలతో దేవతా మూర్తులను అర్చించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో ఏయే పుష్పాలతో దేవతలను అర్చిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే వివరాలను పురోహితులు ఈ క్రింది విధంగా సూచిస్తున్నారు.

లక్షమారేడుపత్రాలు, లక్షశతపత్రాలు, లక్షశంఖపుష్పాలు, లక్షపద్మాలతో శివార్చన చేస్తే - కుబేరునికన్నా ధనవంతులవుతారని విశ్వాసం. అలాగే విష్ణుమూర్తిని కదంబ పుష్పాలతో పూజిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.

ఇంకా శివ పరమాత్మను ఉమ్మెత్తలతో పూజిస్తే సంతానం, అవిసెపూలతో పూజిస్తే కీర్తి, తులసిదళాలతో పూజిస్తే శతృజయం, జాజిపూలతో పూజిస్తే వాహనలాభం కలుగుతాయని పురోహితులు అంటున్నారు. అదేవిధంగా విష్ణువును అవిసెపూవులతో పూజిస్తే పదివేల యజ్ఞాల ఫలం కలుగుతుందని వారు చెబుతున్నారు.

ఇంకా మల్లెపువ్వులతో ఏ దేవతా మూర్తిని పూజించినా.. అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. అయితే వాసనలేని పువ్వులను పూజకు ఉపయోగించడం మంచిది కాదు.