Thursday, March 28, 2013

ఎవరు గొప్ప.....!?







నువ్వు గొప్పా? నేను గొప్పా? నువ్వు పెద్దా? నేను పెద్దా? అనే పోటీ అనాది నుంచి వస్తున్నదే. అలాగే ఇదే పోటీ ఓ సారి మానవుని చేతిలో ఉండే ఐదు వేళ్ల మధ్య నెలకొంది.

నువ్వు గొప్పా నేను గొప్పా అని చేతి వేళ్లు తమలో తాము వాదులాడుకోవడం ప్రారంభించాయి. అప్పుడు మొదటి వేలు "నేను లేకుండా మిగిలిన నాలుగు వేళ్లు ఏమీ చేయలేవు కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. ఇది విన్న చూపుడు వేలు "కాదు కాదు మంచి, చెడులను చూపేది నేనే కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. "అన్నిటికంటే నేనే ఎత్తుగా ఉంటాను కాబట్టి నేనే గొప్ప అన్నది మధ్య వేలు"!

ఇది విన్న ఉంగరపు వేలు "లేదు ఇన్ని వేళ్లు ఉన్నా మనుషులు ఖరీదైన ఉంగరాలను నాకే తొడుగుతున్నారు కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. ఇక మిగిలింది చిటికెన వేలు. దానికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. అన్నిటికన్నా పొట్టిగా ఉన్న చిటికెన వేలు దేవుని సన్నిధానంలో తన బాధను చెప్పుకుంది.

ఇది విన్న దేవుడు ఇలా అన్నాడు... "పొట్టిగా ఉన్నావని బాధపడకు! మనుషులు నన్ను ప్రార్థించే సమయంలో చేతిలోని వేళ్ల వరుసలో నీవే ముందుంటావు కదా? నీవే నాకు దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వే గొప్ప!" అని అన్నాడు దేవుడు. అంతే కదా! మరి ఎవరికి ఎన్ని గుణాలు, సంపద ఉన్నాయన్నది గొప్ప కాదు. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామన్నదే ముఖ్యం. కాదాంటరా...!