Thursday, June 20, 2013

కర్మణ్యే వాధికారస్తే ......!






ఆ కుస్తీలో తంబోలీ గెలిచినట్లుగా ప్రకటించబడింది. సాయిబాబా తన జోలే, తంబిరేలు డొక్కుతో షిరిడీ వదిలి వెళ్ళిపోడానికి సిద్ధమయ్యారు. బాయ్‌జాబాయి, మహాల్యాపతి ప్రభృతులు బాబాకు అడ్డం పడ్డారు. రాముణ్ణి వనవాసానికి వెళ్ళవద్దని వారించే అయోధ్య ప్రజలలాగా మధురకు బయలుదేరిన శ్రీకృష్ణుణ్ణి వెళ్ళవద్దంటూ రథానికి అడ్డు నిలిచిన బృందావన పౌరులులాగా ఎందరో భక్తులు శ్రీ సాయిబాబాను షిరిడీ వదిలి వెళ్ళవద్దని బతిమలాడారు.

``సత్యానికి భిన్నంగా ప్రవర్తించితే అల్లాకృపకు పాత్రులం కాలేము. సత్యమే సాధువుకు సర్వస్వం. ఊరు వదిలిపోయే పందేనికి అంగీకరించే కుస్తీకి దిగాను. ఫలితం అనుభవించక తప్పదు. తప్పుకోండి'' అన్నారాయన. అయినా భక్తులాయనను వదలలేదు. చివరకు మహాల్యాపతి ప్రభృతులంతా తీవ్రంగా ఆలోచించాక ఉబయతారకమైన ఉపాయాన్ని సూచించారు. ఆ ఉపాయం ప్రకారం శ్రీసాయిబాబా మకాం మసీదు నుండి లెండీ కాలవ అవతల గట్టుకు మారింది. అది షిరిడీ గ్రామ పంచాయితీలోకి రాదు. ఇవతల గట్టు వరకే షిరిడీ.

అందువల్ల బాబా షిరిడీ వదిలిపెట్టాలన్న పంతమూ నెరవేరింది. భక్తులకు నిత్యమూ ఆయన దర్శనమూ సేవా కూడా లభించేవి. అయితే భిక్షకు వెళ్ళడం మాత్రం చాలా ఇబ్బందిగా వుండేది. భక్త మహాల్యాపతి బాయ్‌జాబాయ్‌ వంటి వాళు్ళ ఆ ఇబ్బంది కలగకుండా చూశారు. తంబోలీ వర్గానికిది నచ్చలేదు. మళ్ళీ కుస్తీ పోటీ పెట్టి శ్రీ సాయి బాబాను చాలా దూరంగా తరిమివేయాలనుకున్నారు. కాని అప్పటికే ఆత్మ పరివర్తన కలిగిన తంబోలీ శ్రీ సాయిబాబాతో మళ్ళీ కుస్తీ పట్టేందుకు అంగీకరించలేదు. 


తంబోలీలో మార్పు :
దానికి కారణం ఒకటే శ్రీ సాయిబాబాతో తను కుస్తీ పట్టినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది. బాబాకు కూడా కుస్తీలు పట్టడం వచ్చని, ఆయన ఫకీరు కాదు, పహిల్వాను కూడా అని కనిపెట్టాడు తంబోలి. అయితే, నేర్పరియై వుండి కూడా ఆయనెందుకు బోధపడలేదు. తరువాత అర్ధం అయింది. తాను పుట్టిపెరిగిన ఊరినుంచి తనను వెళ్ళగొట్టడం సాయి ఉద్దేశం కాదు. ఊరొదిలి వెళ్ళాల్సిన షరతు మీద షిరిడీలో తనకున్న స్ధిరచరాస్తులు అన్నిటినీ అమ్మేసి, తననొక బికారిని చేయడం కన్నా, ఏ సంపదా లేని శ్రీ బాబా, తామే మరో దారి చూసుకోదల్చుకుని వుంటారు. ఇంతెందుకు గెలిచి పహిల్వాననిపించుకోవడం కన్నా ఓడిపోయినా సరే `ఫకీర్‌'గా బతకడమే గొప్పగా భావించారాయన.

ఎప్పుడైతే తంబోలీకి అలా స్ఫురించిందో అప్పుడే అతని అహంకారం తొలగిపోయింది. నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే బాబాను షిరిడీ నుంచి వెళ్ళిపొమ్మనడం మహా పాపమనిపించింది. వెంటనే అతను - ``హే బాబా! నన్ను క్షమించు నా అజ్ఞానాన్ని మన్నించు దయచేసి నువ్వు ఈ గ్రామంలోనికి రా'' అంటూ పరిగెత్తుకొని వెళ్ళి బాబాను మళ్ళీ షిరిడీలోనికి ఆహ్వానించాడు. కాని, శ్రీ సాయిబాబా అంగీకరించలేదు. ``జరిగిందేదో జరిగిపోయింది. అదంతా భగవంతుని లీలే తప్ప అన్యం కాదు.

ఎవరి కర్మఫలం ఎలా వుంటే అలా జరుగుతుంది గాని ఇందులో ఎవరికెవరూ బాధ్యులు కారు. నీది వాణిజ్యం, నాది కర్తవ్యం. నా వల్ల నీకు కష్టం. తద్వారా నీ మనసుకు కష్టం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్క చెబుతాను విను. ఒక పందెం అనుకున్నాక పందెమే. నేనూ మాట తప్పకూడదు. నువ్వు మాట తప్పకూడదు. నువ్వు గెల్చినందుకు నాకు చాలా ఆనందంగానూ, తృప్తిగానూ వుంది. వెళ్ళు, వెళ్ళి నీ పనిచూసుకో'' అని చెప్పారు.

ఇక బాబా తన పట్టు విడువరని నిశ్చయమైనాక తానే ఈ ఊరు వదిలిపోతానన్నాడు తంబోలి. తక్షణమే తన ఆస్తిపాస్తులను అమ్మకానికి పెట్టాడు. శేషజీవితాన్ని ఆధ్యాత్మిక ధోరణిలో గడిపేందుకుగాను ఏ మక్కా మదీనా యాత్రకో లేదా వేరే ఎవరైనా మహాత్ముని దర్గా దగ్గరకో వెళ్ళి పోతానన్నాడు. అతను షిరిడీ హద్దు దాటి కాలవ ఇతరులకు రాగానే ప్రజల జయజయ ధ్వానాల మధ్యనా, మంగళ తూర్య నాదాల మధ్యనా శ్రీ సాయిబాబా పునఃషిరిడీలో కాలుమోపారు. యధావిధిగా మసీదులో నివసించేందుకు బయలుదేరారు.