కలలో నీళ్లు కనిపిస్తే కొన్ని శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. నదులను, సముద్రాలను దాటినట్లు కలవస్తే శుభమే జరుగుతుంది. సముద్రపు ఒడ్డు అలల మధ్యన ఉన్నట్లు కనిపిస్తే కష్టాలు కలుగుతాయి. నదులు, సముద్రాలు, చెరువులు, కొలనులు మొదలైనవి కనిపిస్తే తలచిన కార్యములు నెరవేరి దేహసౌఖ్యం కలుగుతుంది.
మురికినీరు కలలో కనబడితే అనుకున్న పనులు నెరవేరవు. ఆరోగ్యం దెబ్బతింటుందని పురోహితులు చెబుతున్నారు. బ్రాహ్మణుడు కలలో కనిపిస్తే యజ్ఞము చేస్తారు. ధనము, ఆరోగ్యము కలుగుతుంది. అదేవిధంగా నీటిలో తిరగడం వల్ల కాళ్ళకు పాచి పట్టినట్లు కలగంటే ధనము లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వర్షాలు కురిసినట్లు, వరదలా వచ్చినట్లు కలగంటే రోగాలు సంప్రాప్తమవుతాయి. అయితే వరదలు తగ్గినట్లు కలగంటే కష్టాలు తీరుతాయి. బావిలో నుండి నీరు పొంగి పొర్లుతున్నట్లు కలగంటే ధనం నష్టం, అయినవారిలో ఎవరైనా మరణించడం వంటి అశుభ కార్యాలు జరుగుతాయి.
ఇదే కల స్త్రీకి వస్తే వైధవ్యం లేదా భర్తకి కష్టాలు, ఆపదలు కలుగుతాయి. ఓడ ఎక్కినట్లు కలలు వస్తే ప్రయాణములు చేయాల్సి వస్తుంది. గృహము నిండా నీరు జిమ్మినట్లు కలగంటే నష్టము కలుగుతుంది. నదిలో తలపైకి ఎత్తి ఈదినట్లు కలగంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని జోతిష్య శాస్త్రజ్ఞులు అంటున్నారు.
ఇకపోతే.. చల్లటి నీరు తాగుతున్నట్లు కలగంటే సుఖసంతోషాలు చేకూరుతాయి. అదే వేడి నీరు తాగినట్లు కలగంటే భరించలేని కష్టాలు వచ్చి పడతాయి. బావిలోంచి నీరు తోడుతున్నట్లు కలగంటే ఐశ్వర్య, వివాహ ప్రాప్తి కలుగును.