Showing posts with label HAPPY DEWALI. Show all posts
Showing posts with label HAPPY DEWALI. Show all posts

Friday, November 1, 2013

దీపావళి రోజున తెలుపు బట్టలు ధరించి.. పూజ చేయండి....!?









దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవమూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.

ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.

జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.

దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.


Monday, November 12, 2012

దీపావళి లక్ష్మీ పూజ...












లక్ష్మీ పూజ లేదా దీనినే ఐశ్వర్యాన్ని సంపదలను ఇచ్చే మాత లేదా అమ్మవారి పూజ అంటారు. ఉత్తర భారత దేశమైనా లేక దక్షిణ భారతదేశమైనప్పటికి దీపావళి పండుగ కార్యక్రమాలలో లక్ష్మీ పూజ ప్రధానమైంది. లక్ష్మీ దేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ, ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాత కు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరతారు.

మాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంటిని ఆ మాత మొట్టమొదటే అడుగిడుతుందన్న నమ్మకంతోప్రతి ఇల్లు ఈ రోజు ఎంతో శుభ్రతతో, వివిధ రకాల ముగ్గులతో, దీపాలతో, పూలతో అలంకరిస్తారు. శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు, కుంకుమలు పెట్టి ఈ రోజున పూజిస్తారు.అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు,లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.

ఇక దీపావళి పూజ ఎలా చేస్తారు?

పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి,మహా కాళి, రూపాలలోపూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.

పూజకు ఏర్పాటు ఎలా వుండాలి?

కొద్దిపాటి ఎత్తుగా పీట వేయండి. లేదా ఇంటిలో వున్న టీ పాయ్ వంటివి కూడా బాగానే వుంటాయి.దానిపై తెల్లటి లేదా ఎరుపు రంగు కల కొత్త గుడ్డను పరవండి. ఆ కొత్త గుడ్డపై మధ్యలో బియ్యంగింజలు పోసి దానిపై అలంకరణ చేయబడిన కలశాన్ని(చెంబు) పెట్టండి. కలశంలో మూడు వంతుల నీరు, తమలపాకులు, మామిడి ఆకులు, పూలు, కొన్ని నాణేలు వేయాలి. కలశంపై వేరే గిన్నె పెట్టి దానిని బియ్యం గింజలతో నింపాలి. కలశంపై పసుపుతో పద్మం గుర్తు లేదా స్వస్తిక్ గుర్తు వంటివి గీయాలి.కలశంపై పెట్టిన బియ్యంకల గిన్నెలో లక్ష్మీ దేవి బొమ్మను, నాణేల సహితంగా వుంచాలి.కలశం ముందు కుడివైపుగా అంటే నైరుతి దిక్కుకు, గణేషుడి విగ్రహం వుండాలి.పిల్లల పెన్నులు, పుస్తకాలు లేదా మీ వ్యాపార చిట్టాలు మొదలైనవి కూడా ఈ విగ్రహాల ముందుంచాలి.విగ్రహాలకు పూలదండలు వేయండి.దీపారాధన చేయండి, మంచి సువాసనల అగర్ బత్తీలను వెలిగించండి.ఇక దేవికి, గణేషుడికి, పూజ కొరకు పసుపు, కుంకుమ, పువ్వులను అక్కడే పెట్టండి.


 పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె అన్నీ కలిపి పంచామృతాలు తయారు చేయండి.కొబ్బరి కాయలు, పండ్లు, పంచామృతాలు, స్వీట్లు, ఇతర తిండి పదార్ధాలు పూజానంతరం లక్ష్మీ మాతకు నైవేద్యం పెట్టండి.ముందుగా గణపతిని పూజించండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం లేదా, సహస్రనామం మంత్రాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఒక పళ్ళెంలో పెట్టి నీరు, పంచామృతాలతో స్నానం చేయించండి. స్నానం చేయించే నీటిలో బంగారు వస్తువు లేదా ఒక ముత్యాన్ని వుంచాలి. స్నానం తర్వాత విగ్రహాన్ని శుభ్రం చేసి కలశంపై పెట్టండి.దేవికి గంధం, పసుపు, కుంకుమలు వేయండి. పూలదండ వేయండి.అప్పటికే సిద్ధంగా వుంచుకున్న కొబ్బరి చెక్లు, పండ్లు, స్వీట్లు మాతకు గణేషుడికి నైవేద్యం పెట్టండి.తర్వాత, అక్కడ పెట్టిన పిల్లల పుస్తకాలు, లేదా వ్యాపార చిట్టాలు ని పూజించండి. వాటిలోని పేజీలపై పసుపుతో శ్రీ అని లేదా శుభ్ లాభ్ అని వ్రాయాలి. సవ్యమైన పద్ధతిలో స్వస్తిక్ గుర్తు రాయాలి.

ఇంటిలో చేసిన పిండివంటలు, తిండి పదార్ధాలను, మహా నైవేద్యంగా అమ్మవారికి పెట్టి దాని తర్వాత‘ ఓం జై జగదీష్ హరే ’ లేదా ఇతర హారతి పాటలతో మాత లక్ష్మీ దేవికి హారతి పట్టండి. చివరగా, ప్రసాదాన్ని అక్కడ వున్న కుటుంబ సభ్యులకు పెట్టి మీరు కూడా తీసుకోండి. ఇక ఇపుడు ఇంటి ప్రాకారంలో ఆకర్షణీయమైన ప్రమిదలతో నూనె దీపాలను లేదా కేండిల్స్ లేదా రంగుల బల్బులను వెలిగించి వెలుగులు విరజిమ్మండి.
ఇంటిలోని లేదా ఇంటి ఆవరణలోని ఏ భాగమూ కూడా చీకటితో నిండరాదని గమనించండి.

*** పూజకు ముందు దీపాలను వెలిగించరాదని కూడా గమనించండి.



జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళి












భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.