
ఓటమి నుండి ఓంకారమునకు :
నిజానికిదంతా
సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని
నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు.
అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన
రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే
తప్ప మరొకటి కాదు.
అందువల్లనే
ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ బాబా మరింత విరాగిగా ఉండిపోయారు. అప్పటి
నుంచి సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. ధోవతీలను మానేశారు. లంగోటా
బిగించుకుని పైన పొడవైన తెల్ల చొక్కా ముతకది ధరించేవారు. తలకొక గుడ్డను
కట్టుకుని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు చుట్టుకునే వారు.
అప్పటి
దాకా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేయడం, రోగులకి ఉచిత వైద్యం అందించడం,
దెయ్యాల వలన, గ్రహదోషాల వలన పీడించబడేవారిని కాపాడటం, ఇటువంటి వాటివల్ల
షిరిడీలో ఆయన ``మంచివాడు'' అనీ, పరోపకారస్ధుడనీ పేరు పడ్డారు. ఆయననెంతగా
ఆరాధించినా బాయ్‌జాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తము్మడే. ఆమె కుమారుడు తాత్యాకు
మేనమామే. మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి,
అవతారపురుషుడూ సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు.
అద్భుతయోగం - ధౌతి :
యోగ
అభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను మూడు
అంగుళాల వెడల్పూ, ఇరవైరెండున్నర అంగుళాల పొడవు వుండే గుడ్డను మింగి ఒక
అరగంట సేపు దానిని కడుపులోనే ఉండనిచ్చి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. ఈ
యోగ విద్యను ``ధౌతి'' అంటారు. సాయిబాబా కూడా ఇలాంటి ``ధౌతి''ని
చేసుకునేవారు. కాని, వారి ధౌతీ చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు రవంత ఎడంగా
ఒక బావి ఉంది. ఒక రోజున సాయిబాబా ఆ బావి దగ్గర తను ధౌతీని నిర్వహించారు.
అది గుడ్డ మింగడం కాదు. సరాసరి తమ ఊపిరితిత్తలను బయటకు కుక్కి, నీళ్ళతో
శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్ళీ తనలోకి
అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన ధౌతీని కొందరు ప్రత్యక్షంగా చూడడంతో బాబా పట్ల
వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్యయోగం.
ఖండయోగం :
ఒక
విశ్రాంతి రోజు రాత్రి, శ్రీ సాయిబాబా తమ శరీర అవయవాలు అన్నిటినీ కాలికి
కాలు, చేయికి చేయిగా వేరు చేసి మసీదులోని వేరు వేరు స్ధలాలలో వుంచారు. ఈ
సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాభిల్ తన విధి నిర్వహణలో మసీదుకు
వెళ్ళి, చెల్లాచెదురుగా పడివున్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరో
ఖండఖండాలుగా నరికేశారని ఊహించాడు. కాని ఆ సంగతి తను బయటపడితే నేరం తన మీద
పడుతుందేమోనన్న భయంతో మౌనంగా వుండిపోయాడు. మర్నాడు మసీదుకు వెళుతున్న
జనంతోపాటు తాను కూడా ఏమీ తెలియని వాడి లాగానే వెళ్ళాడు. తీరావెళ్ళే సరికి
బాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా
దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాభిల్ నోరు వెళ్ళబెట్టాడు. బాబా
చిరునవు్వ నవు్వతూ ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి ``భయపడకు బ్రతికే
వున్నానులే'' అని వెన్ను తట్టే వరకు అతని పరిస్ధితి అయోమయమే. అనంతరం అసలు
విషయమేమిటని కొందరు ప్రశ్నించడంతో ఆ అప్పాభిల్ క్రితం రోజు తను చూసిన
దృశ్యాన్ని తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్నే
``ఖండయోగం'' అంటారు.
లాకోత్తర యోగ సమాధి-శవాసనం :
ఇంకొకసారి
అంటే 1886 సంవత్సరం, ఆగస్టు 13వ తేదీ రాత్రి వేళ, మహాల్సాపతిని పిలిచి,
``మహల్సా! ఈ శరీరాన్ని మూడు రాత్రుళ్ళు పాటు కాపాడు. తిరిగి వచ్చానా
సరేసరి, లేకపోతే మూడు రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదు కెదురుగా వున్న
ఖాళీ స్ధలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలని గుచ్చిపెట్ట''మని చెప్పి
అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేలమీద శవాసనం చేసి వుండిపోయారు శ్రీ
బాబా. క్రమంగా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడటం మానేసింది. అసలే సాయిబాబా
వేసినది శవాసనమేమో నాడీ, ఊపిరీ నిలిచిపోయే సరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే
కనిపించసాగింది. మహాల్సాపతి అక్కడి నుంచి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి
కాపలదారుగా అక్కడే ఉండిపోయాడు.
తెల్లవారింది.
ఎప్పటిలాగానే బాబా దర్శనమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేబరంలా కనిపించారు.
వాళు్ళ కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా పాకింది. ఊరి పెద్దలొచ్చారు
మసీదుకి. వాళ్ళతోపాటు ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టరు బాబా శరీరాన్ని
పరీక్షించాడు. ``బతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు. ఇతను చచ్చిపోయాడు. అతని
ఆత్మ, శాంతి మాయమై విశ్రాంతి పొందునుగాక'' అని చెప్పాడన్నమాట. ఇంకేముంది
మనం నిజంగా బతికే వున్నా కూడా డాక్టరుగారు మనం మరణించామని ధృవీకరిస్తే
తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబారానికీ
ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు. కాని మహల్సాపతి
మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకుని ఆ జనాలకు అడ్డం పడ్డాడు.
`` ఈ
శరీరాన్ని మూడు రాత్రులు పాటు కాపాడమని సాయి చెప్పాడు. అందువల్ల
మూడోరాత్రి గడిచేదాక నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరమైతే
నన్ను కూడా సజీవ సమాధో, సజీవదహనమో చేసెయ్యండి'' అని భీష్మించాడు. దానితో ఈ
గొడవ అహ్మదాబాదు జిల్లా కలెక్టరు దాకా వెళ్ళింది. ఆయన
ఇంగ్లీషాయన.
``శ్రీ సాయిబాబా చెప్పినట్లు మూడు రాత్రులు ఆగే తీరా''లన్న ఆయన
భక్తులవాదాన్నీ, డాక్టర్ సర్టిఫికెట్ కారణంగా అది శవమే కాబట్టి, వెంటనే
అంత్యక్రియలు చేయాలి అన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన
`` ఆగవలసింది మూడు రాత్రులేగదా! మీ గొడవల మధ్యన రెండు రాత్రులు ఎటూ
అయిపోయాయి. ఇంకొక్క రాత్రి ఆగండి. తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి.
ఒకవేళ ఆ ఫకీరు బతికితే మాత్రం వెంటనే నాకు తెలియజెయ్యండి. డాక్టర్లు డెత్
సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బతకడం అసాధ్యం. అది ఒక్క ఏసుక్రీస్తుకే
సాధ్యమైంది. బతికితే ఈయన కూడా అంతటివాడే'' అన్నాడు కలెక్టరు.
దాంతో
రెండు వర్గాల వారూ కలహాలు మానేశారు. తెల్లారగా సాయిబాబా శవానికి
అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో వున్నారు కూడా - అంతర్యుద్ధాలు
మాత్రం జరగలేదు. మూడు రాత్రులూ గడిచాయీ అనగానే అంటే ఆగస్టు 16
తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేళప్పుడు సాయిబాబా శరీరంలో ఊపిరి
ప్రవేశించింది. నాడి ఆడటం ప్రారంభమైంది. శవంలా పడి వున్న కళేబరం
సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులూ
లేవు.సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలూ లేవు. సాయిబాబా పునర్జీవితులయ్యారన్న
వార్త కలెక్టరుకు అందింది. ``అయితే సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు
అవతారమే'' అని చెప్పారాయన. దీన్ని బట్టి సాయిబాబా యొక్క యోగశక్తి మనకు
బోధపడుతోంది గదా! అంతేకాదు ఈ నాటి సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప
యితరం కాదు. ఈ క్షణానికీ ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే
వున్నారు. తనకై తపించే భక్త కోటికి, వారి వారి అర్హతల రీత్యా లీలా
దర్శనాన్ని అనుగ్రహిస్తూనే వున్నారు. శరణాగతులకు ఎనలేని సహాయసహకారాలని
అందిస్తూనే వున్నారు. కావలసినదల్లా సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు
మాత్రమే.
అప్పుడప్పుడు
శ్రీ సాయి నీంగావ్‌లోని డేంగలే సోదరులు యిళ్ళకు వెళుతుండేవారు. వారిలో
చిన్న వాడైన నానా సాహెబ్ రెండు పెళ్ళిళు్ళ చేసుకున్నా కూడా సంతానం
కలగలేదు. ఒకసారి అతను తన బాధని శ్రీ బాబా ముందు వెళ్ళబోసుకోగా దయామయులైన
శ్రీ సాయి ``కొడుకుల్ని కను'' అని దీవించారు. ఎందరో వైద్యుల చేత కూడ కాని
పని బాబా ఆశీర్వచన బలం వల్ల పండంటి సంతానం కలిగింది. మసీదులో వెలిగించిన
నీటిదీపాలు, డేంగలేకిచ్చిన ఈ దివ్య ఆశీస్సు వల్ల సాయిబాబా కీర్తి నేల
నాలుగుదిక్కుల వ్యాపించింది.
తంబోలీ :
శ్రీ
సాయిబాబా తమ వేషాన్ని మార్చారు. తెల్లటి తలపాగా, తెల్లటి అంగీ, తెల్లటి
ధోవతి ధరిస్తుండేవారు. దినచర్య మాత్రం మారలేదు. శ్రీ సాయిబాబా షిరిడీలో
నివాసమేర్పరచుకునే నాటికి ఆ వూరిలో ప్రసిద్ధుడైన మరో వ్యక్తి ప్రముఖ
వస్తాదు తంబోలీపహిల్వాన్. ఇతను తాయెత్తులూ అవీ అము్మకుంటూ వుండేవాడు.
ఊరిలో వాళ్ళకి జ్వరాలు వచ్చినా, దెయ్యాలు పట్టినా ఇతనినే ఆశ్రయించేవారు.
వాళ్ళదగ్గర బాగా డబ్బు గుంజుకుని, తాళూ్ల తాయెత్తులూ కట్టేవాడు. షిరిడీలో
ఇతనో గొప్పభూత మాంత్రికుడుగా చెలామణీ అవుతుండేవాడు.
కాని
సాయిబాబా షిరిడీలో నివసించడం ఇతని వ్యాపారానికి ఆటంకంగా పరిణమించింది. ఊరి
వాళ్ళ జబ్బులనీ, భూతప్రేత పిశాచ గ్రహాల వలన బాధలని శ్రీ సాయిబాబా ఉచితంగా
వదలగొడుతూ వుంటే ఇక తంబోలీని ఆశ్రయించి డబ్బు లెవరిస్తారు? భోజనం హోటలు
పక్కనే నిరంతరం అన్నదాన సత్రం పెడితే ఆ హోటలు యజమాని పని దివాళయే కదా!
ప్రస్తుతం తంబోలి పరిస్ధితి అలాగే తయారైంది. దీనితో తంబోలికి బాబాపై ద్వేషం
ఏర్పడింది. ఇద్దరి మధ్య నగను రెచ్చగొట్టేందుకు ఎందరైనా వుంటారు కదా... ఆ
విధంగా తంబోలిలో శ్రీ సాయిపై కక్ష దినదిన ప్రవర్ధమానంగా వచ్చింది. సద్గురు
శ్రీ షిరిడీ సాయినాథునికి త్రికరణశుద్ధిగా వినమ్రుడినై అనంతమైన వారి లీలలో
ఒక దానిని ఈ ఘట్టానికి అన్వయింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
షిరిడీ గ్రామస్ధులలో ఒకనొకరికి దెయ్యం పట్టింది. వాళ్ళ అలవాటు ప్రకారం వాళు్ళ తంబోలీని ఆశ్రయించారు.
కాని, ఫక్తు వ్యాపారస్దుడైన తంబోల్ వారి నుంచి అధిక ధనాన్ని ఆశించాడు.
అంత సొము్మ వారి దగ్గరలేదు. ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్న వారికి - ఏ
మహాల్సాపతి వంటివాడు ఎదురై - మసీదులో ఉన్న శ్రీ సాయిబాబాని
ఆశ్రయించవలసిందిగా హితవు చెప్పాడు. వాళ్ళలాగే శ్రీ బాబాని ఆశ్రయించారు.
శ్రీ బాబా ఒక కొబ్బరికాయను తెప్పించి - దెయ్యం పట్టిన వ్యక్తికి
దిగదుడిచారు. అలా దిగదుడుస్తూనే అతని చెవిలో ఏదో చెప్పారు. ఏం చెప్పారో
ఎవరికీ వినపడనే లేదు. దిగదుడిచిన కొబ్బరికాయను పగుల గొట్టించగానే దెయ్యం
దిగిపోయింది. ఆ వ్యక్తి యధాప్రకారం ఆరోగ్యవంతుడయ్యాడు.
ఈ
సంగతి ఊరిలో ప్రచారమైంది. శ్రీ సాయిబాబాకు ఎనలేని ఖ్యాతి కలిగింది. కాని
తంబోలీకి కంటకంగా పరిణమించింది. కొందరు దుష్టుల సలహాపై తంబోలీ ఒక నాటకం
ఆడాడు. తనకే దెయ్యం పట్టినట్లుగా నటించాడు. అతని వర్గం మనుషులంతా కల్సి,
అతన్ని సాయిబాబా ముందుకు తెచ్చారు. దెయ్యాన్ని దింపమన్నారు. అలాంటప్పుడు
బాబా అతని చెవిలో మంత్రం చెప్పాలి కదా! ఆ మంత్రం తెలుసుకోవాలనే ఇంత
నాటకమన్నమాట. కాని, శ్రీ సాయిబాబాకు తెలియదా వాళ్ళ నాటకం! మనుషుల
హృదయాలలోనే కాదు, సృష్టిలోని సమస్తమైన పశుపక్షి క్రిమికీటకాల మనోగత -
భావాలనూ ఇట్టే పసిగట్టగల సాయినాథునికి ఇలాంటి తమాషాలు లెక్కలోనివి కాదుగదా!
అందుకనే
ఆయన... దెయ్యాన్ని దింపేందుకుగాను భూతమాంత్రికుల పద్ధతినే ప్రయోగించారు.
ఛెళు్ళఛెళు్ళన ఈ చెంపా ఆ చెంపా వాయించి వదలిపెట్టారు. దాంతో అప్పటిదాకా
తమాషా చేస్తున్న తంబోలీ అహంకారంతో తిరగబడ్డాడు. ``కేవలం షిరిడీలోని నాలుగు
గడపలలో బిచ్చమెత్తుకుని బ్రతుకే ఒక ఫకీరు తన మీద చెయ్యి చేసుకోడమా?'' అని
హుంకరించాడు. అతనితో వున్న అతని వర్గీయులందరూ తంబోలీనే బలపరిచారు.
న్యాయానికి ప్రధానమైన సాక్ష్యం తంబోలీ వైపునే తప్ప - శ్రీ సాయి వైపున
లేకపోయింది. అయినా శ్రీ సాయి చలించలేదు.
`దానికేముంది?
ఒక్కొక్క దెయ్యాన్ని ఒక్కొక్క రకంగా దింపుతాము. బలులూ, చింతబరికెలతో
చిత్రహింసలూ, మంత్రాలూ, తాయెత్తులూ రకరకాలు అందులో ఇదో పద్ధతి. ఇప్పటిదాకా
తను సైతాను మనిషి, ఇప్పుడు తంబోలీ నంటున్నాడు. మొత్తం మీద దెయ్యం
దిగిపోయింది గదా! అంటారు శ్రీ సాయిబాబా. కాని తంబోలీ వర్గం వాళ్ళెవరూ
ఊరుకోలేదు. ఆ వూరిలో పుట్టి ఆ ఊరిలో పెరిగిన తనని, తన వాళ్ళ మధ్య చెంపదెబ్బ
కొట్టడం - తల కొట్టడం కన్నా అవమానంగా భావించాడు తంబోలీ. తనని
కొట్టేపాటి బలవంతుడైతే తనతో కుస్తీకి దిగమన్నాడు. ఆ ఊరిలో తనో, బాబాయో
ఎవరో ఒకళ్ళే వుండాలన్నాడు. కుస్తీలో ఓడిపోయినవాళు్ల షిరిడీ వదిలి
వెళ్ళిపోవాలన్నాడు. అతని వత్తాసుగాళ్ళందరూ ``సై'' అన్నారు. మహాల్సాపతి
ప్రభృతులు ``అన్యాయం'' అని చెప్పినా ఎవరూ వినలేదు. చుట్టుపక్కల పరగణాలలో
పెద్ద వస్తాదుగా పేరు మోసిన తంబోలీ పహిల్వానుకీ - సాధూ సాయినాథులకూ కుస్తీ
జరగక తప్పదన్నారు. సాయిబాబా కుస్తీకి సిద్ధపడ్డాడు. మహాల్సాపతి వంటి
భక్తులెందరో ఆయనను ఆపాలని ప్రయత్నించారు. కాని, బాబా వారి మాటలను
తోసిపుచ్చారు.
ఆ
కుస్తీలో తంబోలీ గెలిచినట్లుగా ప్రకటించబడింది. సాయిబాబా తన జోలే,
తంబిరేలు డొక్కుతో షిరిడీ వదిలి వెళ్ళిపోడానికి సిద్ధమయ్యారు. బాయ్‌జాబాయి,
మహాల్యాపతి ప్రభృతులు బాబాకు అడ్డం పడ్డారు. రాముణ్ణి వనవాసానికి
వెళ్ళవద్దని వారించే అయోధ్య ప్రజలలాగా మధురకు బయలుదేరిన శ్రీకృష్ణుణ్ణి
వెళ్ళవద్దంటూ రథానికి అడ్డు నిలిచిన బృందావన పౌరులులాగా ఎందరో భక్తులు శ్రీ
సాయిబాబాను షిరిడీ వదిలి వెళ్ళవద్దని బతిమలాడారు.
``సత్యానికి
భిన్నంగా ప్రవర్తించితే అల్లాకృపకు పాత్రులం కాలేము. సత్యమే సాధువుకు
సర్వస్వం. ఊరు వదిలిపోయే పందేనికి అంగీకరించే కుస్తీకి దిగాను. ఫలితం
అనుభవించక తప్పదు. తప్పుకోండి'' అన్నారాయన. అయినా భక్తులాయనను వదలలేదు.
చివరకు మహాల్యాపతి ప్రభృతులంతా తీవ్రంగా ఆలోచించాక ఉబయతారకమైన ఉపాయాన్ని
సూచించారు. ఆ ఉపాయం ప్రకారం శ్రీసాయిబాబా మకాం మసీదు నుండి లెండీ కాలవ అవతల
గట్టుకు మారింది. అది షిరిడీ గ్రామ పంచాయితీలోకి రాదు. ఇవతల గట్టు వరకే
షిరిడీ.
అందువల్ల
బాబా షిరిడీ వదిలిపెట్టాలన్న పంతమూ నెరవేరింది. భక్తులకు నిత్యమూ ఆయన
దర్శనమూ సేవా కూడా లభించేవి. అయితే భిక్షకు వెళ్ళడం మాత్రం చాలా ఇబ్బందిగా
వుండేది. భక్త మహాల్యాపతి బాయ్‌జాబాయ్ వంటి వాళు్ళ ఆ ఇబ్బంది కలగకుండా
చూశారు. తంబోలీ వర్గానికిది నచ్చలేదు. మళ్ళీ కుస్తీ పోటీ పెట్టి శ్రీ సాయి
బాబాను చాలా దూరంగా తరిమివేయాలనుకున్నారు. కాని అప్పటికే ఆత్మ పరివర్తన
కలిగిన తంబోలీ శ్రీ సాయిబాబాతో మళ్ళీ కుస్తీ పట్టేందుకు అంగీకరించలేదు.
తంబోలీలో మార్పు :
దానికి
కారణం ఒకటే శ్రీ సాయిబాబాతో తను కుస్తీ పట్టినప్పుడు ఒక విషయం స్పష్టంగా
అర్ధమైంది. బాబాకు కూడా కుస్తీలు పట్టడం వచ్చని, ఆయన ఫకీరు కాదు, పహిల్వాను
కూడా అని కనిపెట్టాడు తంబోలి. అయితే, నేర్పరియై వుండి కూడా ఆయనెందుకు
బోధపడలేదు. తరువాత అర్ధం అయింది. తాను పుట్టిపెరిగిన ఊరినుంచి తనను
వెళ్ళగొట్టడం సాయి ఉద్దేశం కాదు. ఊరొదిలి వెళ్ళాల్సిన షరతు మీద షిరిడీలో
తనకున్న స్ధిరచరాస్తులు అన్నిటినీ అమ్మేసి, తననొక బికారిని చేయడం కన్నా, ఏ
సంపదా లేని శ్రీ బాబా, తామే మరో దారి చూసుకోదల్చుకుని వుంటారు. ఇంతెందుకు
గెలిచి పహిల్వాననిపించుకోవడం కన్నా ఓడిపోయినా సరే `ఫకీర్'గా బతకడమే
గొప్పగా భావించారాయన.
ఎప్పుడైతే
తంబోలీకి అలా స్ఫురించిందో అప్పుడే అతని అహంకారం తొలగిపోయింది.
నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే బాబాను షిరిడీ నుంచి వెళ్ళిపొమ్మనడం మహా
పాపమనిపించింది. వెంటనే అతను - ``హే బాబా! నన్ను క్షమించు నా అజ్ఞానాన్ని
మన్నించు దయచేసి నువ్వు ఈ గ్రామంలోనికి రా'' అంటూ పరిగెత్తుకొని వెళ్ళి
బాబాను మళ్ళీ షిరిడీలోనికి ఆహ్వానించాడు. కాని, శ్రీ సాయిబాబా
అంగీకరించలేదు. ``జరిగిందేదో జరిగిపోయింది. అదంతా భగవంతుని లీలే తప్ప అన్యం
కాదు.
ఎవరి
కర్మఫలం ఎలా వుంటే అలా జరుగుతుంది గాని ఇందులో ఎవరికెవరూ బాధ్యులు కారు.
నీది వాణిజ్యం, నాది కర్తవ్యం. నా వల్ల నీకు కష్టం. తద్వారా నీ మనసుకు
కష్టం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్క చెబుతాను విను. ఒక పందెం
అనుకున్నాక పందెమే. నేనూ మాట తప్పకూడదు. నువ్వు మాట తప్పకూడదు. నువ్వు
గెల్చినందుకు నాకు చాలా ఆనందంగానూ, తృప్తిగానూ వుంది. వెళ్ళు, వెళ్ళి నీ
పనిచూసుకో'' అని చెప్పారు.
ఇక
బాబా తన పట్టు విడువరని నిశ్చయమైనాక తానే ఈ ఊరు వదిలిపోతానన్నాడు తంబోలి.
తక్షణమే తన ఆస్తిపాస్తులను అమ్మకానికి పెట్టాడు. శేషజీవితాన్ని ఆధ్యాత్మిక
ధోరణిలో గడిపేందుకుగాను ఏ మక్కా మదీనా యాత్రకో లేదా వేరే ఎవరైనా మహాత్ముని
దర్గా దగ్గరకో వెళ్ళి పోతానన్నాడు. అతను షిరిడీ హద్దు దాటి కాలవ ఇతరులకు
రాగానే ప్రజల జయజయ ధ్వానాల మధ్యనా, మంగళ తూర్య నాదాల మధ్యనా శ్రీ సాయిబాబా
పునఃషిరిడీలో కాలుమోపారు. యధావిధిగా మసీదులో నివసించేందుకు బయలుదేరారు.
శ్రీమదనంతకోటి
బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మా, శ్రీమత్ సచ్చిదానంద సమర్ధ
సద్గురు శ్రీ సాయినాథ మహరాజ్ వారు `పత్రి' అనే గ్రామంలో ప్రభవించారనీ,
బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని, కొంతకాలం తరువాత `సేలూ'
గ్రామంలోని ``వెంకూసా'' అనే సద్గురువును కలసి, వారి సహచర్యం వలన సమస్త
శక్తులనూ పొంది `షిరిడీ' గ్రామంలో ఆయన చరణం మోపారనీ ఒకానొక కథ ప్రచారంలో
వుంది.
ఈ
కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ర్టలోని ప్రముఖ హరిదాసు,
శ్రీ సాయిలీలా ప్రచారకుడూ అయిన దాసగణుడే కావడం వలన అనేకానేక మంది దానిని
విశ్వసించక తప్పలేదు. ఆ విశ్వాసంతోటే ``పత్రీ గ్రామ సముద్భూతం'' వంటి
అష్టకాలు వగైరా రచించబడిపోయాయి. కాని, కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ
సాయిబాబా ``నేను-సేతా నుంచి షిరిడీ వచ్చాను. నా గురువు పేరు వెంకూసా'' అని,
తనతో చెప్పిన ముక్కలను బట్టి, ఈ శ్రీ సాయీ జన్మ రహస్యగాథను తానే స్వయంగా
కల్పించాననీ, ఇది కట్టుకథే తప్ప యదార్ధమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవనీ,
అదే దాసగణు అంగీకరించడం జరిగిందని గురు స్ధానీయులైన శ్రీ ఎక్కిరాల
భరద్వాజగారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు. అదీగాక, బాబా సాయిశరణానందతో
తన గురువు పేరు రోషన్‌షా అనీ హెచ్.వి.సారేతో ఏదో షా అనీ చెప్పారట.
ఏది
ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తను చెప్పింది అబద్ధమనీ, కల్పన అనీ
ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ వుండరు కదా! కాని ఈ ఆలోచనలన్నింటినీ
పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది. కేవలం భారతదేశంలోనే
గాక అఖిల ప్రపంచంలోనూ కూడా `భగవాన్'గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి
సత్యసాయిబాబా ది 28-9-1990న శ్రీ షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన
విషయాన్ని వెలువరించారు.
షిరిడీసాయి జన్మరహస్యంపై పుట్టపర్తి సాయి ప్రవచనం :
నైజాం
రాష్ర్టంలో మారుమూలనున్న కుగ్రామం ప్రతి. ఆ పత్రీ గ్రామంలో గంగా
భవాఢ్యుడు, దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు. దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు.
ఆమె భర్త ఈశ్వరభక్తుడు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం
చేస్తూనే ఉండేవారు. దేవగిరమ్మ భర్త గంగాభవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన
``జీవనయాత్ర''ను గడుపుతూ వుండేవాడు. వర్షాకాల మగుట చేత, గంగ ఉప్పొంగుట చేత
గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమో అని భార్యతో చెప్పి, ఆనాటి రాత్రికి
యింటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు. భర్త కోరిక
ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి, తాను కూడా ఏడు గంటలకే
భుజించింది. తొమ్మిది గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని, తన భర్త
తిరిగి వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరచింది దేవగిరియమ్మ.
విత చరిత్ర ప్రవచనం సందేశాలు :
ఎవరో
ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు ``అమ్మా! బయట చలి చాలా తీవ్రంగా వుంది.
లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. ఆమె చాలా ఉత్తమురాలు.
కనకనే వరండా లోపలికి పరుపు తెచ్చి యిచ్చి, అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన
తలుపువు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ
వృద్ధుడు తలుపులు తట్టాడు. ఆమె తిరిగి తలుపులు తెరిచింది. ``అమ్మా! నాకు
చాలా ఆకలిగా వుంటున్నది. ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె యింటిలో వెతికి
కొంచెం పిండిని పెరుగులో కలిపి యిచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకొని
లోపలికి వెళ్ళింది. ఆ వృద్ధుడు ఆమెతో ``తల్లీ! నాకు కాళ్లు నొప్పులుగా
వుంటున్నాయి కొంచం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి
పూజాగదిలో కూర్చుని, తల్లీ ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు. ఈ సమయంలో నేనేమి
చేసేది. అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా వుండేదా'' అని చాలా
బాధపడుతూ అటువంటి పరిస్ధితిని తప్పించుకుని ఎందుకీ పరిస్ధితిని కల్పించావని
పార్వతీదేవిని వేడుకుంది.
ఆమె
ఏదో ఆలోచిస్తూ వుంటుంటే మళ్ళీ తలపుతట్టిన శబ్దమయ్యింది. కాని ఈసారి మాత్రం
వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది. ``అమ్మా ఒక ముసలాయనకు సేవ చేయాలట
గదా! ఎవరికి సేవలు చెయ్యాలి?'' అని పలికింది. తాను ప్రార్ధించిన తన
పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన
స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి, ఆమె తలుపులు
వేసుకుంది.
అక్కడికి
వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు. వీరిద్దరు ఒకరితో
ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. ``పార్వతీ! ఆమె మనోభీష్ఠమును
నెరవేర్చు'' అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది.
``మీరు పరమేశ్వరులు కదా! మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు ``నేను ఈమెను
పరీక్షించడం కోసం వచ్చిన వాడను. నీవు ఆమె ప్రార్ధన విని వచ్చినదానవు.
కనుక, నీవే ఆ వరాలు అందించు'' అన్నాడు.
తిరిగి
తలుపు తట్టిన శబ్దం విని `` ఆ స్త్రీ వుంది కదా'' అని ఆమె ధైర్యంతో తలుపు
తెరచింది. వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు.
దేవగిరియమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి, అమితమైన సంతోషముతో వారి పాదాలపైన
పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది. ``వంశోద్ధారకుడైన ఒక
కుమారుడిని, కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను - నీకు అనుగ్రహిస్తున్నాను''
అని చెప్పింది. దేవగిరియమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. ``అమ్మా! నీ
భక్తికి సంతోషించాను. ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను'' అని దీవించాడు
ఈశ్వరుడు. ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికి ఆ ఇద్దరూ
అదృశు్యలయ్యారు.
తెల్లవారేటప్పటికి
ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగినదంతా ఆమె పూస గుచ్చినట్లు
చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకము కలుగకపోవుట చేత ``దేవగిరీ!
ఏమిటి నీకీ పిచ్చి ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి?
పరమేశ్వరుడేమిటి? అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి
నమ్మకం కలుగలేదు.
కొంతకాలం
గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు
పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య
చెప్పిన ఈ రెండు విషయాలూ ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ
పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు. ``నీకు ఈ ప్రాప్తి
సంభవించింది. నాకు ఆ ప్రాప్తి లభించలేదు'' అని గంగాభవాఢ్యుడు తన భార్యతో
అన్నాడు.
తన
భార్య వలే తాను కూడా పార్వతీపరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక,
దీక్ష కలిగింది. ఆ తర్వాత ఈమెకు మూడవ గర్భం ప్రారంభమయ్యింది. ఈ దృశ్యాన్ని
కూడా నిదర్శనంగా గమనించుట వలన ఇతని మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా
మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలి?
ఎప్పుడు తపస్సు చేయాలి? ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం
చేసుకోవాలి? అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. ఈమెకు
నవమాసాలు నిండిపోయాయి. ఆ సమయమందే ``నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను'' అని
భార్యతో చెప్పాడు.
దేవగిరమ్మ
కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవవేదన
ఎక్కువయ్యింది. ఆ మార్గమధ్యములోనే (ది 28/9/1835న) ప్రసవించింది. ఆ బిడ్డయే
శ్రీ సాయిబాబా. తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే
పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే, ఈ పిల్లవానికి తల్లి
ఎవరు? తండ్రి ఎవరు? అనేది ఎవరికి తెలియదు. ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు
కనిపించుట చేత, ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు.
సుమారు
నాలుగు సంవత్సరాల పాటు, 1839 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరు యింటనే పెరిగాడు.
కాని నాలుగవ ఏట 1839లో ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకియైన ఆ ఫకీరు భార్య ఈ
పాపడిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కురవ్రాడి
చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్ధితి
ఏర్పడింది.
ఆ
అనాధ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి
ప్రవచించేవాడు. ``మై అల్లాహూ'' (నేనే దేవుణ్ణి) అనేవాడు ఒక్కొక్కసారి
``అల్లా మాలిక్'' (దైవమే సర్వాధికారి) అనేవాడు. అనంతరం మసీదులోకి వెళ్ళి
``రాముడే అల్లా - శివుడే దేవుడు'' అని వెర్రికేక లేసేవాడు. హిందువుల
యింటబుట్టి ఫకీరు యింట పెరిగిన ఈ కురవ్రాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి
అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు. ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆ
తల్లి అతనిని చేరువలో ఉన్న ``వెంకుసా'' అనే సద్గురువుకు అప్పగించింది. ఆ
సద్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఆ
పన్నెండేళ్ళలోనూ గురుశిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి పోయింది.
శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికి సుమారు పదహారు
సంవత్సరాల వయసులో అనగా క్రీ.శ. 1851లో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం
చేస్తూ శిరిడీ గ్రామం చేరుకున్నాడు.
రెండు
నెలలపాటు శిరిడీలో గడిపిన అనంతరం పుహదేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు.
మళ్ళీ చాంద్‌భాయి పోటీలు బంధువుల పెళ్ళి నిమిత్తమై ఆ పెళ్ళివారితో కలిసి
శిరిడీ చేరడం. తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు
సంవత్సరాల పాటు ఆయన శిరిడీలోనే ఉండిపోయాడు. ఇది అసలు కథ.
శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ వారి జన్మగాథ శ్రీ సత్యసాయి యోగశక్తికి, దివ్యవృష్టికి ప్రతీకగా భావించాలి.