నెరవేరని ఆశల్లో ఒక భాగమే కలలుగా వస్తాయని పండితులు అంటూ ఉంటారు. అయితే స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మక శక్తి అధికంగా గలవారికే కలల్లో పాములు కన్పిస్తాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.
ఇందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌ను జ్యోతిష్కులు ఉదాహరణగా చెబుతున్నారు. పెన్సిలిన్‌ను కనిపెట్టేందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చాలా కాలం పాటు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, ఓ రోజు రాత్రి ఆయన కలలో కన్పించిన పాము, దాని కదలికలను బట్టి ఫ్లెమ్మింగ్ పెన్సిలిన్‌ను కనిపెట్టారని పండితులు అంటున్నారు.
పాము కలలో కన్పిస్తే ఏం జరుగుతుందో? ఏమో? అని అందరూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉంటారు. మీ కలలో పాము కన్పించి, అది కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా.. పాము స్వప్నంలో కన్పించి, ఏమీ చెయ్యకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖసంతోషాలతో ఉంటారు.
అయితే కలలో పాము మిమ్మల్ని వెంటాడితే మాత్రం సమస్యలు, కష్టాలు తప్పవని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. ఇలా.. పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లైతే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని వారు అంటున్నారు.
పాము వెంటాడినట్లు కన్పిస్తేనో, లేదా తరచూ స్వప్నంలో పాములు కన్పిస్తే.. ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు, కోడిగ్రుడ్లు, పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు సమర్పించుకుని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యలను నుంచి తప్పుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.