Monday, October 8, 2012

నవగ్రహాల్లో చంద్రుడి శాంతికి ఏం చేయాలంటే..?








కర్కాటక రాశి నాథుడైన చంద్ర భగవానుడి శాంతికి సోమవార వ్రతము చేయటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చంద్ర గ్రహానుకూలత కోసం నవరత్నాలలోని ముత్యాన్ని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇంకా పౌర్ణిమనాడు చంద్రోదయ సమయమున రాగి పాత్రయందు తేనెకలిపిన పాయసమును వండి చంద్రునికి సమర్పించినట్లైతే వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు వంటి శుభఫలితాలు చేకూరుతాయి.

పౌర్ణమి రోజున శివోపాసనం, శివస్తుతి చేసినట్లైతే సర్వసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇంకా సోమవారం వ్రతం చేసి వెండి, శంఖము, తెల్లని చందనము, శెనగలు, శ్వేతపుష్పములు పెరుగు, ముత్యాలు వంటివి బ్రాహ్మణులకు దానమిస్తే సకల సంపదలు, వంశాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇక నవగ్రహాల్లో రెండో స్థానానికి అధిపతి అయిన చంద్రుడి ఆకారవర్ణన ఎలా ఉంటుందంటే..? చంద్రుడు గౌరవర్ణం కలవాడు. చంద్రగ్రహ మహాదశకాలము పది సంవత్సరాలు. చంద్రుని వస్త్రము, అశ్వము, రథము శ్వేత వర్ణములే. స్వర్ణమకుటము, ముత్యాలహారము ధరిస్తాడు. హస్తగధాయుధుడు. మరో హస్తమున వరముద్రను కలిగి ఉంటాడు. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, పురుషస్వరూపుడని అంటారు.

శ్రీ కృష్ణభగవానుడు జన్మించకముందే చంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడందురు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించియుంటాడు. అత్రి మహర్హి, అనసూయలపుత్రుడైన చంద్రభగవానుడిని సర్వమయుడని కూడా పిలుస్తారు. బీజ, ఓషధి జలపూరుడైన చంద్రుడు అశ్విని, భరణిలతో కూడిన 27మంది నక్షత్రాలను వివాహమాడాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

చంద్రుడిని సతీమణులైన ఈ 27 మంది నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మములను పాలిస్తూ... వర్షములను, మాసములను విభజించుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక చంద్ర భగవానుడి వాహనమైన శ్వేత రథములో మూడు చక్రములు, దివ్యమైన పది అశ్వాలుంటాయి. అశ్వాల నేత్రములు కూడా శ్వేత వర్ణమును కలిగియుంటాయని పురోహితులు అంటున్నారు.

ఇకపోతే.. చంద్రునికి బుధుడు అనేపుత్రుడు కలడు. ఇతడు తారకకు జన్మించిన వాడు. చంద్రునికి అధిదేవత, ప్రత్యధిదేవత గౌరీదేవి. అందుచేత గౌరీదేవిని పూజించడం ద్వారా చంద్రగ్రహ ఆధిపత్యంతో కలిగే కొన్ని సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.