శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనె లేదా ఆవునేతితో శ్రీరామ చంద్రుడినికి పంచహారతులివ్వాలని పురోహితులు అంటున్నారు. శ్రీరామనవమి రోజున నైవేద్యంగా సమర్పించే వడపప్పు, పానకం ఆ శ్రీరామునికి ఎంతటి శ్రేష్టమైనవో అందరికీ బాగా తెలుసు.
ఇదే తరహాలో కొబ్బరి నూనె లేదా నేతితో నింపిన కంచుదీపంలో ఐదు దూది వత్తులను ఉంచి పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజామందిరాన్ని అందమైన రంగవల్లికలు, పసుపు రంగు పువ్వులు లేదా తామర పువ్వులతో అలంకరించుకోవాలి.
అనంతరం కంచుదీపముతో స్వామివారికి పంచహారతులు సమర్పించుకోవాలి. ఇలా చేసిన వారికి వాహనయోగం, గృహనిర్మాణం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీతారామసమేత శ్రీరామచంద్రమూర్తి ప్రతిమకు లేదా ఫోటోకు పూజలు చేసి ఇంటికి వచ్చే ముత్తైదువులకు శ్రీరామ నిత్యపూజ అనే పుస్తకము, తాంబూలముతో కలిపి ఇవ్వడం ద్వారా మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుని ఆలయాలను సందర్శించి, అక్కడ జరిగే సీతారామ కళ్యాణము, శ్రీసీతారామపట్టాభిషేక ఉత్సవాలను కనులారా వీక్షించే వారికి కోటి జన్మల పుణ్యఫలము, సుఖసంతోషాలు, సర్వభోగభాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
అలాగే ఆలయాల్లో పంచామృతముతో అభిషేకము చేయించే వారికి సుఖసంతోషాలతో పాటు లక్ష్మీకటాక్షము చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.