నవగ్రహాలలో శుభగ్రహంగా గురుగ్రహాన్ని పేర్కొంటారు. దేవతల పాలిట గురువుగా (బృహస్పతి) భావించే ఈ గురు గ్రహాన్ని, తెలివి, జ్ఞానం వంటి వాటికి ప్రధానంగా భావిస్తున్నారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం వంటి వాటికి గురు ఫలాలను జ్యోతిష్కులు ప్రధానంగా పరిశీలిస్తారు.
ఇకపోతే... గురుగ్రహానికి పుష్యరాగం రత్నం ప్రీతిపాత్రమైంది. ధనుస్సు, మీనం అనుకూల రాశులు కాగా, గురుగ్రహానికి కర్కాటకం ఉచ్ఛస్థానంగా, మకరం నీచ స్థానాలుగా ఉంటాయని జ్యోతిష్కులు అంటున్నారు. శుభ గ్రహమైన గురువు 5, 7, 9 స్థానాలపై ప్రత్యేక దృష్టి చూపుతాడు. గురుబలంతో ఉండే జాతకులు అన్ని విధాలా పురోగతి సాధిస్తారు. పలు ఘనతలు సాధించడం, ఉన్నత పదవులను అలంకరించడం, పరిపాలనాధికారం దక్కడం, మంచి వ్యక్తులుగా ప్రశంసలు అందుకోవడం వంటివి గురుగ్రహాధిపత్యంతో చేకూరుతాయి.
శాంత స్వరూపి, సాత్విక గుణం కలిగిన గురుగ్రహాధిపతి... తనను కొలిచే భక్తులకు కోరిన ఫలాలను కల్పవృక్షంలా అందిస్తాడని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇకపోతే... రాహువు 5వ స్థానంలోనూ లేక గురువు కేంద్రస్థానంలోనూ బలపడితే, ఆ జాతకుడికి మగసంతానం అధికంగా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు.
విద్యాధిపతిగా బుధగ్రహం ఉన్నప్పటికీ, గురు బలంతో జాతకులు విద్యాపరంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విశ్వాసం. నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుని ఆధిపత్యంతో జాతకులు అష్టకష్టాలను అనుభవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... గురువు దృష్టి పడితే మాత్రం ఆ జాతకులకు యోగం సంప్రాప్తించగలదని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు.