కార్తీక మాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దైవం లేదంటారు. సూర్యుడు తులారాశి లోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.కార్తీక పౌర్ణమి రోజున ఇంటిల్లపాది దీపాలతో అలంకరించడంతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించడం, నేతితో దీపమెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం వంటి సుకార్యాలను చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయాలి. ఇతరులకు దీపాలను దానం చేయాలి.
కార్తీక పౌర్ణమి నాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.
అలాగే ఈ రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. కార్తీక పౌర్ణమి నాడు లలితాదేవి సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఇదే రోజున దీపారాధన చేయడం ద్వారా శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతుంటారు.