సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన జాతకుల వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. అలాంటివారిలో రెండో తేదీన జన్మించిన జాతకులు కూడా ఉన్నారు. పుట్టినతేదీ రెండుగా ఉంటే ఆ జాతకులు వైవాహిక జీవితంలో సకల సుఖ సంతోషాలను అనుభవిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఇంకా ఈ జాతకులది ప్రేమ వివాహమైతే మరింత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అదే ఒకటో తేదీన పుట్టిన జాతకులను ప్రేమించి, పెళ్లి చేసుకుంటే వీరికి తిరుగేలేదు. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే రెండో సంఖ్య వారు 3, 5, 8 సంఖ్యల్లో పుట్టిన జాతకులను వివాహమాడినా జీవితం సుఖప్రదంగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే.. రెండో తేదీన పుట్టిన జాతకులు 25ఏళ్లలోపు వివాహం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. వీరి సంసార జీవితం వల్ల యోగ్యమైన సంతానం లభించే అవకాశముంది. వివాహానంతరం వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
అయితే భాగస్వామి ఎంపిక చేయడంలో రెండో సంఖ్యలో పుట్టిన జాతకులు కాస్త జాగ్రత్త వహించడం అవసరమని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఇక రెండో సంఖ్యలో జన్మించిన స్త్రీలు.. అనుకున్న కార్యాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి సహాయంతో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఈ నెంబరులో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కార్యాన్నైనా ధైర్యంతో అనుకున్నట్లు పూర్తి చేస్తారు.
రెండో నెంబరులో పుట్టిన, స్త్రీ, పురుషులు నవరత్నాలలో జాతి ముత్యంగానీ, చంద్రకాంతి మణినిగానీ ధరిస్తే శుభాలు చేకూరుతాయి. ఇంకా ఈ జాతకులు వెండితో చేసిన వివిధ రకాల ఆభరణాలు ధరించడం చాలా మంచిది. దీంతో పాటు శివ పరమాత్మను నిత్యం పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.