సంపూర్ణ సూర్యగ్రహణానంతరం గ్రహణాతీతుడైన శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకోండని పండితులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటి దేవాలయం గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు స్వయంభులింగంగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు.
వాయులింగేశ్వరుడు, సర్వదోషహరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడిగా పిలువబడే ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. "దక్షిణ కాశి"గా ప్రసిద్ధి చెంది, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్ర్యం, దోషాలు తొలిగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని ఆలయ పండితులు చెబుతున్నారు.
అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేగాకుండా ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ కాళహస్తిలో ఒక్క శనీశ్వరుని తప్ప నవగ్రహాలను ప్రతిష్టించకూడదు.
అందుకు బదులుగా ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉన్నాయి. రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని పండితులు అంటున్నారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయని, సూర్యగ్రహణానంతరం ఈ తీర్థాల్లో స్నానమాచరించి, వాయులింగేశ్వరుడిని దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు, అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.