Wednesday, August 1, 2012

ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే...!!?







నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి,

"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే" అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది.

చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు.

మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.