ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు మీదుగా ఒక దొంగ వెళుతూ అతణ్ణి చూశాడు. బహుశా రాత్రి ఎక్కడో కన్నం వేసుంటాడు. దోచుకున్న సోమ్మంతా మోయలేక ఇక్కడిలా పడి ఉంటాడనుకున్నాడు.
కొద్దిసేపటికి ఒక తాగుబోతు ఆ దారిన వెళుతూ పడుకున్న మనిషిని చూశాడు. బహుశా తప్పతాగి పడి ఉంటాడనుకున్నాడు. మరికొంతసేపటికి అదేమార్గంలో ఒక సాధువు వెళుతూ నిద్రపోతున్న ఆ మనిషిని చూశాడు. బహుశా ఈ మనిషి దైవధ్యానంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అందుకే ఒళ్ళుతెలియని స్థితిలో ఇలా పడుకుని ఉన్నాడు. ఎంత అదృష్టవంతుడు! అనుకున్నాడు.
మన స్వభావాన్నిబట్టే మన ఆలోచనలుంటాయి. వ్యతిరేకదృష్టితో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. అందువల్ల మనసు అశాంతికీ, అల్లకల్లోలానికీ లోనవుతుంది. అలాకాక ఎదుటివారిని అనుకూల దృష్టితో చూడండి, అప్పుడు మనసు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుందంటారు శ్రీరామకృష్ణపరమహంస.