ఓ సారి అక్కచెల్లెళ్లయిన శ్రీదేవి, జేష్టాదేవీలకు తమలో ఎవరిది వయ్యారమైన నడక అని సందేహం వచ్చింది. నా నడకే అందంగా ఉంటుందంటే నాదేనని వాదులాడుకున్నారు. ఎవరిది వయ్యారి నడకో తేల్చుకోడానికి ఎవరినైనా అడగాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన నారద మహర్షిని న్యాయనిర్ణేతగా వ్యవహరించమన్నారు.
విషయం అర్థమైన నారదునికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఇద్దరి నడకలు వయ్యారంగానే ఉన్నాయి. జేష్టాదేవీ నడక బాగుందంటే శ్రీదేవికి కోపం... శ్రీదేవి నడక బాగుందంటే జేష్టాదేవీకి కోపం...!
ఇలానే ఆలోచిస్తుండగా, నారద మునికి ఓ ఉపాయం తట్టింది. భూలోకంలో శిఖామణి అనే ఓ భక్తుడు ఉన్నాడు. అతను మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు అని సూచించాడు నారదుడు.
దీంతో జేష్టాదేవీ, శ్రీదేవి భూలోకానికి పయనమయ్యారు. శిఖామణి ముందు నడిచి చూపించి తమ ప్రశ్నకు సమాధానం చెప్పమన్నారు. ఇద్దరి నడక వయ్యారంగానే ఉంది.
అయితే స్పష్టమైన నిర్ణయం చెప్పాలంటే ఓ వారం గడువు కావాలని శిఖామణి వారిని కోరాడు. దీనికి వారు సమ్మతించి అప్పటికి శాంతించారు.
ఏమి చెప్పాలో అర్థం కాలేదు శిఖామణికి ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించాలి నారాయణా అని మనసులో ప్రార్థించాడు. అప్పుడు మెదిలింది ఓ ఆలోచన. అంతే వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు.
వారం రోజుల గడువు ముగియడంతో శ్రీదేవి, జేష్టాదేవీలు శిఖామణి వద్దకు వచ్చారు. అప్పుడు మాతా మీరు మరో మారు ద్వారం నుంచి లోపలకు, ద్వారం వైపునకు నడిచి చూపించాలని కోరాడు.
అలానే వాళ్లు కూడా చేశారు. అప్పుడు శిఖామణి ఇలా అన్నాడు. జేష్టాదేవీ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆమె నడక వయ్యారంగా ఉంటుంది. అలానే శ్రీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఆమె నడక వయ్యారంగా ఉంటుందని భక్తితో చెప్పాడు.