Monday, April 1, 2013

విభీషణుడి ఔదార్యం ......!?







రామాయణంలో విభీషణుడి పాత్ర అంతగా ఉండకపోయినా... ఆయన పాత్రకున్న ఔదార్యం అంతా ఇంతా కాదు. రావణుడి వంటి దురాచారుడు జన్మించిన లంకలో విభీషణుడి లాంటి సాధువులు కూడా జన్మించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గంజాయ వనంతో తులసి మొక్కలా చాలా పవిత్రమైన వ్యక్తి విభీషణుడు. రావణుడి సోదరుల్లో విభీషణుడు రెండోవాడు

రావణుడు సీతను లంకకు తీసుకువచ్చినప్పుడు, వదిన మండోదరికి పరిస్థితిని వివరించి భర్తకు నచ్చచెప్పమని వేడుకున్నాడు విభీషణుడు. ఆమె చెప్తే మాత్రం వింటాడా? కాదు పొమ్మన్నాడు. ఇలాగే పలు విషయాల్లో అన్నకు వ్యతిరేకంగా ధర్మమార్గాన్ని పట్టాడు. రావణుడితో యుద్ధం చేసేందుకు రాముడు లంకకు వచ్చిన సమయంలో విభీషణుడు రాముడిని కలిసుకున్నాడు. రాముడికి మంచి మిత్రుడిగా మారి యుద్ధంలో సాయం చేశాడు.

రాక్షస కుటుంబంలో ఇలాంటి వ్యక్తి జన్మించాడా అని రాముడు సాధారణ మానవుడిలానే ఆశ్చర్యపోయాడు. కాగా, రావణుడి యుద్ధం తర్వాత లంకకు నిన్నే రాజుని చేస్తానని అన్నాడు రాముడు. సాధారణంగా ఓ రాజ్యంపై యుద్ధానికి వచ్చి గెలుచుకున్నవారికే ఆ రాజ్యం సొంతమవుతుంది కదా! అయినప్పటికీ, పరుల సొత్తు వద్దని ఆ రాజ్యాన్ని రావణుని సోదరుడైన విభీషణుడికి అప్పగించాలని భావించాడు రాముడు.

అప్పుడు విభీషణుడు "రామా నాకు ఈ రాజ్యాలు, సుఖాలు అనుభవించాలని లేదు. నీ సోదరుడు భరతునికి పాదుకలు ప్రసాదించిన రీతిలోనే నాకు కూడా ప్రసాదించమని" వేడుకున్నాడు. ఇది విభీషణుడి ఔదార్యానికి తార్కాణంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే, రాజ్యాన్ని వదిలిన రాముని ఔదార్యంతో పోలిస్తే విభీషణుడి ఔదార్యం ఎక్కువనే చెప్పాలి. తనకు రావలసిన రాజ్యాన్ని కాదన్నాడు విభీషణుడు. రామ సేవలో రాజ్యాలు తుచ్ఛంగా భావించాడు. యుగపురుషుడిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. ఔదార్యానికి చక్కని ఉదాహరణగా నిలిచాడు.


 విభీషణుడి ఔదార్యం

  అప్పుడు విభీషణుడు "రామా నాకు ఈ రాజ్యాలు, సుఖాలు అనుభవించాలని లేదు. నీ సోదరుడు భరతునికి పాదుకలు ప్రసాదించిన రీతిలోనే నాకు కూడా ప్రసాదించమని" వేడుకున్నాడు. ఇది విభీషణుడి ఔదార్యానికి తార్కాణంగా నిలిచింది.