Tuesday, April 2, 2013

నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి....!!?







నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? నిత్యం మనం వెళ్లే దేవాలయాల్లో నవగ్రహాలు వివిధ దిశలను చూస్తున్నట్టుగా చదరపు ఆకారంలో ఉంటాయి కదా. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం ఆశ్చర్యపడే రీతిలో నవగ్రహాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం!

తమిళనాడులోని తిరువారూరులో ఉన్న త్యాగరాజర్ ఆలయం, మధురై సమీపంలో ఉన్న కారియాపట్టి వైదీశ్వరన్ ఆలయాల్లో ఒకే వరుసలో నవగ్రహాలు కనిపిస్తాయి. అంటే ఒక గ్రహం తర్వాత ఇంకోటి అన్నట్టుగా వరుసలో ఉంటాయి. వీటి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

అంతేకాదు, నవగ్రహాలు ఒకే దిశ వైపు ముఖం ఉండే భంగిమలు తమిళనాడులో ఉన్న గున్రకుడి శణ్ముగ నాదర్ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో నవగ్రహాలు ఒకే వైపు ఉండడం చూపరులను ఆశ్చర్యపరుస్తాయి.

తమిళనాడులోని తిరుక్కరుకావూర్‌లోని కర్పరచ్చకాంబికై ఆలయంలో నవగ్రహాలన్నీ ఒకే దిశవైపు తిరిగి ఉంటాయట. అంటే మధ్యలో ఉండే సూర్య గ్రహానికి అభిముఖంగా మిగిలిన గ్రహాలు చుట్టూ ఉంటాయి. విష్ణు మూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు ఇవి మనకు తెలిసిన విషయాలే.

అయితే ఇంకో విషయం ఏమిటంటే నవగ్రహాలకు మంత్రాలు పఠించడం, ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టమట. మరి ఆలస్యమెందుకు ఈ ఆలయాలను సందర్శించి నవగ్రహాలను ధ్యానించి లాభం పొందండి.