ఈ సృష్టిలో ఏ శక్తీ మీకు వ్యతిరేకమైనది కాదు. మీరు ఉపయోగించుకోవడాన్నిబట్టే ఒక శక్తి మీకు లాభానికో, నష్టానికో, సృష్టికో, విధ్వంసానికో కారణమవుతుంది. ఒకరోజు సూర్యోదయాన్ని ఫోటో తీయాలనుకుంటారు. ఆ రోజు ఒకటే మబ్బులు, ముసురు, వాన పడుతుంది. మీ కోరిక నెరవేరలేదన్న కోపంతో ప్రకృతిపై అయిష్టంతో మీ గదిలో ఓ మూలన ముడుచుకుని కూర్చున్నంత మాత్రాన ప్రకృతి మారుతుందా?
అది కాదు మీరు చేయాల్సింది. ఆ వానను ఆసక్తిగా గమనించాలి. ఒక అద్భుతమైన హరివిల్లు కనబడి మీకు ఆనందాన్నివ్వవచ్చు. ఎప్పుడో తప్ప కన్పించని పొగమండలం ఏర్పడవచ్చు. లేదా ఇంటిపని చేసుకోవడానికి అది మీకో అవకాశం అనుకోండి.
ఒక బలమైన శక్తివల్ల మీరు అనుకున్నది జరుగకుండాపోవచ్చు. ఐతే చెయ్యదగ్గ, చేయగలిగినవాటిని చేయకుండా డీలా పడిపోవడం, చేతకానితనం, పిచ్చితనం అవుతుంది.