శ్రీమదనంతకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మా, శ్రీమత్ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ మహరాజ్ వారు `పత్రి' అనే గ్రామంలో ప్రభవించారనీ, బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని, కొంతకాలం తరువాత `సేలూ' గ్రామంలోని ``వెంకూసా'' అనే సద్గురువును కలసి, వారి సహచర్యం వలన సమస్త శక్తులనూ పొంది `షిరిడీ' గ్రామంలో ఆయన చరణం మోపారనీ ఒకానొక కథ ప్రచారంలో వుంది.
ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ర్టలోని ప్రముఖ హరిదాసు, శ్రీ సాయిలీలా ప్రచారకుడూ అయిన దాసగణుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు. ఆ విశ్వాసంతోటే ``పత్రీ గ్రామ సముద్భూతం'' వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి. కాని, కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా ``నేను-సేతా నుంచి షిరిడీ వచ్చాను. నా గురువు పేరు వెంకూసా'' అని, తనతో చెప్పిన ముక్కలను బట్టి, ఈ శ్రీ సాయీ జన్మ రహస్యగాథను తానే స్వయంగా కల్పించాననీ, ఇది కట్టుకథే తప్ప యదార్ధమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవనీ, అదే దాసగణు అంగీకరించడం జరిగిందని గురు స్ధానీయులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు. అదీగాక, బాబా సాయిశరణానందతో తన గురువు పేరు రోషన్‌షా అనీ హెచ్.వి.సారేతో ఏదో షా అనీ చెప్పారట.
ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తను చెప్పింది అబద్ధమనీ, కల్పన అనీ ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ వుండరు కదా! కాని ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది. కేవలం భారతదేశంలోనే గాక అఖిల ప్రపంచంలోనూ కూడా `భగవాన్'గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా ది 28-9-1990న శ్రీ షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు.
షిరిడీసాయి జన్మరహస్యంపై పుట్టపర్తి సాయి ప్రవచనం :
నైజాం రాష్ర్టంలో మారుమూలనున్న కుగ్రామం ప్రతి. ఆ పత్రీ గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు. దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు. ఆమె భర్త ఈశ్వరభక్తుడు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు. దేవగిరమ్మ భర్త గంగాభవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన ``జీవనయాత్ర''ను గడుపుతూ వుండేవాడు. వర్షాకాల మగుట చేత, గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమో అని భార్యతో చెప్పి, ఆనాటి రాత్రికి యింటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు. భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి, తాను కూడా ఏడు గంటలకే భుజించింది. తొమ్మిది గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని, తన భర్త తిరిగి వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరచింది దేవగిరియమ్మ.
విత చరిత్ర ప్రవచనం సందేశాలు :
ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు ``అమ్మా! బయట చలి చాలా తీవ్రంగా వుంది. లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. ఆమె చాలా ఉత్తమురాలు. కనకనే వరండా లోపలికి పరుపు తెచ్చి యిచ్చి, అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపువు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు. ఆమె తిరిగి తలుపులు తెరిచింది. ``అమ్మా! నాకు చాలా ఆకలిగా వుంటున్నది. ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె యింటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి యిచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది. ఆ వృద్ధుడు ఆమెతో ``తల్లీ! నాకు కాళ్లు నొప్పులుగా వుంటున్నాయి కొంచం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజాగదిలో కూర్చుని, తల్లీ ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు. ఈ సమయంలో నేనేమి చేసేది. అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా వుండేదా'' అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్ధితిని తప్పించుకుని ఎందుకీ పరిస్ధితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది.
ఆమె ఏదో ఆలోచిస్తూ వుంటుంటే మళ్ళీ తలపుతట్టిన శబ్దమయ్యింది. కాని ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది. ``అమ్మా ఒక ముసలాయనకు సేవ చేయాలట గదా! ఎవరికి సేవలు చెయ్యాలి?'' అని పలికింది. తాను ప్రార్ధించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి, ఆమె తలుపులు వేసుకుంది.
అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు. వీరిద్దరు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. ``పార్వతీ! ఆమె మనోభీష్ఠమును నెరవేర్చు'' అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది. ``మీరు పరమేశ్వరులు కదా! మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు ``నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను. నీవు ఆమె ప్రార్ధన విని వచ్చినదానవు. కనుక, నీవే ఆ వరాలు అందించు'' అన్నాడు.
తిరిగి తలుపు తట్టిన శబ్దం విని `` ఆ స్త్రీ వుంది కదా'' అని ఆమె ధైర్యంతో తలుపు తెరచింది. వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరియమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి, అమితమైన సంతోషముతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది. ``వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను - నీకు అనుగ్రహిస్తున్నాను'' అని చెప్పింది. దేవగిరియమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. ``అమ్మా! నీ భక్తికి సంతోషించాను. ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను'' అని దీవించాడు ఈశ్వరుడు. ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికి ఆ ఇద్దరూ అదృశు్యలయ్యారు.
తెల్లవారేటప్పటికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగినదంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకము కలుగకపోవుట చేత ``దేవగిరీ! ఏమిటి నీకీ పిచ్చి ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి? పరమేశ్వరుడేమిటి? అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి నమ్మకం కలుగలేదు.
కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ రెండు విషయాలూ ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు. ``నీకు ఈ ప్రాప్తి సంభవించింది. నాకు ఆ ప్రాప్తి లభించలేదు'' అని గంగాభవాఢ్యుడు తన భార్యతో అన్నాడు.
తన భార్య వలే తాను కూడా పార్వతీపరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత ఈమెకు మూడవ గర్భం ప్రారంభమయ్యింది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన ఇతని మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలి? ఎప్పుడు తపస్సు చేయాలి? ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి? అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. ఈమెకు నవమాసాలు నిండిపోయాయి. ఆ సమయమందే ``నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను'' అని భార్యతో చెప్పాడు.
దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవవేదన ఎక్కువయ్యింది. ఆ మార్గమధ్యములోనే (ది 28/9/1835న) ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే, ఈ పిల్లవానికి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? అనేది ఎవరికి తెలియదు. ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు కనిపించుట చేత, ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు.
సుమారు నాలుగు సంవత్సరాల పాటు, 1839 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరు యింటనే పెరిగాడు. కాని నాలుగవ ఏట 1839లో ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకియైన ఆ ఫకీరు భార్య ఈ పాపడిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కురవ్రాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్ధితి ఏర్పడింది.
ఆ అనాధ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. ``మై అల్లాహూ'' (నేనే దేవుణ్ణి) అనేవాడు ఒక్కొక్కసారి ``అల్లా మాలిక్'' (దైవమే సర్వాధికారి) అనేవాడు. అనంతరం మసీదులోకి వెళ్ళి ``రాముడే అల్లా - శివుడే దేవుడు'' అని వెర్రికేక లేసేవాడు. హిందువుల యింటబుట్టి ఫకీరు యింట పెరిగిన ఈ కురవ్రాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు. ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న ``వెంకుసా'' అనే సద్గురువుకు అప్పగించింది. ఆ సద్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఆ పన్నెండేళ్ళలోనూ గురుశిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి పోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికి సుమారు పదహారు సంవత్సరాల వయసులో అనగా క్రీ.శ. 1851లో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ శిరిడీ గ్రామం చేరుకున్నాడు.
రెండు నెలలపాటు శిరిడీలో గడిపిన అనంతరం పుహదేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ చాంద్‌భాయి పోటీలు బంధువుల పెళ్ళి నిమిత్తమై ఆ పెళ్ళివారితో కలిసి శిరిడీ చేరడం. తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాల పాటు ఆయన శిరిడీలోనే ఉండిపోయాడు. ఇది అసలు కథ.
శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ వారి జన్మగాథ శ్రీ సత్యసాయి యోగశక్తికి, దివ్యవృష్టికి ప్రతీకగా భావించాలి.