Sunday, September 29, 2013

చేతి వేలు పూర్తిగా తెగితే ఏం చేయాలి.....!?






చేతి వేలు పూర్తిగా కట్ అయినట్లయితే, ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఐస్‌కవర్‌లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ప్రమాదం జరిగిన 6 నుంచి 8 గంటలు లోగా ఆస్పత్రికి చేరుకునేలా చూసుకోవాలి. సరైన సమయంలోగా ఆస్పత్రికి చేరుకుంటే సర్జరీ ద్వారా తెగిన వేలును అతికించే అవకాశం ఉంటుంది.

డ్రెస్సింగ్ చేసుకుని, రక్తస్రావం కాకుండా కట్టు కట్టుకుని ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రికి వెళితే ఉపయోగం ఉంటుంది. అక్కడ వైద్యులు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది? కండరాలు ఎంత మేరకు కట్ అయ్యాయి? టెండాన్స్ ఎలా ఉన్నాయి? తదితర విషయాలను పరిశీలించి అవసరమైన చికిత్సను అందిస్తారు.

చేయి పూర్తిగా కట్ అయినప్పుడు కూడా సమయంలోగా ఆస్పత్రికి వస్తే ఆపరేషన్ చేసి చేయి పోకుండా కాపాడే వీలుంది. నరం కట్ అయి చేతి స్పర్శ కోల్పోయినపుడు నరాన్ని తిరిగి అతికించడం ద్వారా పోయిన స్పర్శ వచ్చేలా చేయవచ్చు. కండరం బాగా దెబ్బతింటే ఇతర భాగంలో నుంచి కండరం తీసుకుని సర్జరీ ద్వారా అమర్చడం జరుగుతుంది. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు.

రొడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చేతులు, కాళ్లు బాగా గీరుకుపోయి ఉంటాయి. లోతైన గాయాలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలతో అవయువాలు పనితీరు కోల్పోకుండా కాపాడవచ్చు.

Sunday, September 15, 2013

వామన జయంతి16న .. వైష్ణవ ఆలయాలను దర్శించుకోండి...!






ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.

ఆ కథ ఏమిటంటే...? పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.

ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.

ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.

ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.

శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.

శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.

సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.

బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెబుతున్నాయి.

అట్టి మహిమాన్వితమైన వామనుడు పుట్టిన రోజున శ్రీ మహావిష్ణువును నిష్టతో ప్రార్థించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా.. ఆరోజున వైష్ణవ దేవాలయాలను సందర్శించుకునేవారికి సకల సంపదలతో పాటు పుణ్యఫలము సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

Monday, September 9, 2013

వినాయక వ్రత కథ మీకు తెలుసా.....!?





గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి విలపించింది. జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది.

విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు.

గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించి, అయినా మాట తపకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు.

నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు. అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది.

తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.

జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

Ganesh Chaturthi





Happy Ganesh Chaturthi 


వినాయకుడిని తులసీ పత్రాలతో పూజించవచ్చా....!?






వినాయక చవితినాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలతో పూజించడం సంప్రదాయం. అయితే ఈ పత్రాల్లో తులసీ దళానికి చోటుండదు. సర్వదేవతలకు పవిత్రమైనటువంటి తులసీ పత్రం వినాయకుడి పూజకు ఎందుకు పనికి రాదో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణం ఏమిటంటే..

ఓసారి గంగాతీరంలో విఘ్నేశ్వరుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు నిరాకరించడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ధర్మధ్వజ రాజపుత్రికను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు. ఇంకా తులసి వినాయక పూజ ఆశించిన ఫలితాలను ఇవ్వదని పురోహితులు అంటున్నారు. అందుచేత వినాయకుడికి ప్రీతికరమైన పత్రాలతో పూజించాలని వారు సూచిస్తున్నారు...!

Ganesh Chaturthi






Happy Ganesh Chaturthi 



Ganesh Chaturthi




 
Happy Ganesh Chaturthi