Friday, October 12, 2012

రాహువుకు ఏ భగవదారాధన మంచిదో తెలుసా..?!







నవగ్రహాల్లో రాహుగ్రహానికి దుర్గాపూజ, సరస్వతీ పూజ, కుమారీ పూజ, దుర్గాస్తోత్ర పారాయణ, దేవి భాగవత పురాణ పారాయణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధస్సు, శిరోపరిభాగం, గడ్డం అనే శరీర భాగాలకు రాహువు ప్రాతినిధ్యం వహిస్తాడు.

రాహువు పరిహార క్రియల విషయానికొస్తే.. శక్తిగలవారు దున్నపోతును దానం చేయవచ్చును. స్కందపురాణ, సుబ్రహ్మణ్య చరిత్రను మండల దీక్షతో పారాయణ చెయ్యాలి. నవగ్రహాల్లో రాహు గ్రహం వద్ద 18 వత్తుల దీపారాధన-గోధుమ రంగు వస్త్రదానం చేయడం మంచిది.

దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా ప్రసాదాన్ని పంచిపెట్టడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కావున దుర్గాక్షేత్ర సందర్శన, సర్వక్షేత్రాలు (మోపిదేవి, తిరుత్తణి మొదలగునవి) సందర్శించడం మంచిది.

శ్రీకాళహస్తి, పెద కాకాని దేవాలయాల్లో 9సార్లు రాహుదోష నివారణ పూజ చేయించాలి. ఆదివారం రోజున మినపగారెలు లేదా మినుములతో చేసిన పదార్థాలను సాధువులకు పంచడం మంచిది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగ ప్రతిష్టలు చేయించడం మంచిది. రాహువునకు 18వేల జపం చేయించి, ఐదు కిలోల 250 గ్రాముల మినుములు దానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికవృద్ధి, వ్యాపారాభివృద్ధి. విద్యాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా గ్రహణం రోజున కాని, అమావాస్య ఆదివారం రోజున కాని, శక్తిని బట్టి బంగారం లేదా వెండి సర్ప ప్రతిమను పడగ ఉండే విధంగా చేయించి దానం చెయ్యాలి. 18 శనివారాలు ఉపవాసం ఉంటూ, చివరి శనివారం రాహువుకు అష్టోత్తర పూజ, దుర్గాదేవికి కుంకుమ పూజ జరిపించాలి. దర్భలతో, ఆవునెయ్యి, తేనె హోమం చేయించడం శుభఫలితాలనిస్తుంది. మినపగారెలు, మినుములతో చేసిన పదార్థాలతో సద్భ్రాహ్మణోత్తమునికి ఆదివారం రోజు సంతృప్తికరంగా భోజనం పెట్టాలి.

ఇకపోతే.. సంఖ్యాశాస్త్ర ప్రకారం 04 సంఖ్య వారు రాహు సంఖ్య అవుతారు. 04 అంటే ఏ నెల, ఏ వారం, ఏ సంవత్సరంలో అయినా 4,13,22 సంఖ్యల వారు పై నివారణోపాయాలను పాటిస్తే సత్ఫలితములు పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.