Sunday, November 10, 2013

మరో వ్యక్తితో అఫైర్ ఉంటే మహిళ అనర్హురాలే: కోర్టు




9.nov.2013


ముంబై: విడిపోయినప్పుడు భార్యకు భర్త చెల్లించే భరణం విషయంలో ముంబై కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్న మహిళకు భర్త భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిన అవసరం లేదని ముంబై కోర్టు తీర్పు చెప్పింది. దక్షిణ ముంబైకి చెందిన 38 ఏళ్ల మహిళ తనను భర్త వదిలేయడంతో అతని నుంచి భరణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. భార్య తనంత తానుగా మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే భర్త నుంచి మెయింటెనెన్స్ ఆమెకు అర్హత ఉండదని, తన తప్పులను ఆమె అవకాశంగా తీసుకోవడానికి అనుమతి ఉండదని ముంబైలోని స్థానిక కోర్టు చెప్పింది. క్రూరంగా వ్యవహరించినందుకు, మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం కలిగి ఉన్నందుకు తన భార్య నుంచి విడాకుల ఇప్పించాలనే 40 ఏళ్ల వ్యక్తి విజ్ఢప్తిని కోర్టు అంగీకరించింది. వారిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. వారికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త నానా చౌక్‌లో వ్యాపారం చేస్తూ ఇంటికి రాత్రి పది గంటల తర్వాత ఇంటికి వచ్చేవాడు. తాను 2005లో ఓసారి త్వరగా ఇంటికి వచ్చానని, ఇంట్లో పిల్లవాడు ఒక్కడే ఉన్నాడని, ఆమెతో మాట్లాడడానికి తాను ఫోన్‌లో ప్రయత్నించానని, అయితే ఫలితం కనిపించలేదని ఆ వ్యక్తి వివరించాడు. ఎక్కడికెళ్లావని అడిగితే తాను తన స్నేహితురాలి వద్దకు వెళ్లినట్లు చెప్పిందని, ఆమెను సంప్రదిస్తే తన వద్దకు రాలేదని చెప్పిందని, పక్కింటి వ్యక్తితో హోటల్‌కు వెళ్లినట్లు మర్నాడు చెప్పిందని అతను తన పిటిషన్‌లో వివరించాడు. తాను లేని సమయంలో ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చేవాడని కూడా చెప్పాడు. దాంతో 2005 డిసెంబర్‌లో ఆ వ్యక్తి భార్యతో విడాకులకు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అయితే, తనకు అక్రమ సంబంధం లేదని మహిళ వాదిస్తోంది. తనతో బలవంతం అంగీకరింపజేస్తూ వాంగ్మూలం రాయించారని ఆమె ఆరోపించింది. కట్నం కోసం తన మామ, సవతి అత్త, మరదళ్లు వేధిస్తున్నారని, ఇల్లు వదిలిపెట్టేలా చేశారని ఆమె ఆరోపించింది. మహిళ వాదనను కోర్టు అంగీకరించలేదు.