కోటానుకోట్ల జీవరాసులకు నెలవైన భూమికి 2012లో పెను ఉపద్రవం ముంచుకొస్తుందన్న వదంతి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచరిస్తోంది. దీనికితోడు "2012 ఎండ్ ఆఫ్ ది వరల్డ్" పేరిట తెరకెక్కిన హాలీవుడ్ సినిమాలోని సంఘటనలు ప్రేక్షకులను మరింత భీతావహులను చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఆయా భవిష్యవాణి పుస్తకాలను తిరగేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 441 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ భవిష్యవాణి పండితుడు నోస్ట్రాడామస్ తన భవిష్యవాణి పుస్తకంలో లిఖించిన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన తన పుస్తకంలో ఇటీవల కాలంలో సంభవించిన పలు దుర్ఘటనలను ప్రస్తావించారట.
ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలిపోతాయని 500 ఏళ్ల క్రితమే ఆయన వెల్లడించాడు. అంతేకాదు హిట్లర్ నియంత వల్ల యుద్ధం ముంచుకొస్తుందని తన పుస్తకంలో జోస్యం చెప్పాడట.
అదేవిధంగా 3097వ సంవత్సరంలో మహాప్రళయం తప్పదనీ, ఆ సమయంలో ఒక బలమైన శక్తి భూమిని ఢీకొని భూగ్రహం అంతమవుతుందని చెప్పాడట. అంటే.. ప్రళయానికి మరో 1788 ఏళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు.
భూమి అంతం అవడానికి ముందు పలు పెను ఉపద్రవాలు సంభవిస్తాయని, మానవాళి తమకు తామే అంతం చేసుకునేందుకు ఆయుధాలను ఉపయోగించుకుంటుందని జోస్యం చెప్పారట. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచంలోని దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు అణుబాంబులను వర్షించుకుంటారట. అలా పెను సంక్షోభంలోకి నెట్టబడిన భూగ్రహం చివరికి 1788 ఏళ్ల తర్వాత మహాప్రళయానికి గురై అంతర్థానమైపోతుందట.