Monday, October 8, 2012

"అక్షయ తృతీయ" నాడు ఏకాక్షీ నారికేళంతో పూజ చేస్తే..!?







సాధారణంగా టెంకాయకు మూడు కళ్లుంటాయి. కానీ కొన్ని నారికేళాలకు అరుదుగా ఒకే కన్ను ఉంటుంది. దీనినే ఏకాక్షీ నారికేళమంటారు. అక్షయ తృతీయ నాడు ఈ అరుదైన ఏకాక్షీ నారికేళాన్ని పూజిస్తే తీరని కోరికంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

ఏకాక్షీ నారికేళానికి పసుపు నూలును చుట్టి కలశంపై ఉంచి, దాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా వ్యాపారంలో నష్టం వచ్చిన వారు అక్షయ తృతీయ నాడు పంచధాతువుల లక్ష్మీ పిరమిడ్‌ను పూజించడం మంచిది.

లక్ష్మీ పిరమిడ్‌కు పూజ చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి, లాభాలు ఉంటాయని పురోహితులు అంటున్నారు. అలాగే శ్వేతార్క గణపతిని అక్షయ తృతీయ నాడు పూజించేవారికి వ్యాధులు, దారిద్ర్యం, ఈతిబాధలు తొలగిపోతాయి. కాగా.. అక్షయ తృతీయ నాడు మర్రిచెట్టును 9 సార్లు ప్రదక్షిణ చేసి మృత్యుంజయ మంత్రాన్ని పఠించేవారికి వ్యాధులు మటుమాయమవుతాయి.

మరోవైపు అక్షయ తృతీయ నాడు వివాహాలు చేసుకునే దంపతులు సుఖసంతోషాలతో, నూరేళ్లపాటు వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ నాడు వివాహాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే.. అక్షయ తృతీయ రోజున పవిత్ర గంగాదేవి (గంగానది) స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్రౌపదీ దేవి మానాన్ని శ్రీ కృష్ణుడు వస్త్రమిచ్చి కాపాడింది కూడా ఈ రోజే. అలాగే బ్రహ్మదేవుడు భూమిని సృష్టించింది కూడా అక్షయ తృతీయ నాడేనని పురోహితులు చెబుతున్నారు.