జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ, అశుభఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
ఇందులో బాగంగా నవగ్రహ పూజలో దీపారాధనకు వాడాల్సిన వత్తులు, దీపారాధనలో ఉపయోగించాల్సిన నూనెలు గురించి తెలుసుకుందాం... సూర్యారాధనలో కుంకుమ వర్ణపు ఏకవత్తిని ఎర్రరంగు ప్రమిదెలో వెలిగించి పూజచేయాలి. దీపారాధనలో ఆవునేతిని ఉపయోగించాలి.
అదేవిధంగా చంద్ర గ్రహ పూజలో ఏకిన దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను వెండి ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనలో నేతిని వాడాలి. కుజ గ్రహ పూజలో కుంకుమ రంగు వర్ణంలో ఉన్న మూడు వత్తులను ఎర్రటి ప్రమిదెలలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనెను వాడాలి.
అలాగే బుధ గ్రహ పూజలో తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలి. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది. ఇక గురుగ్రహ పూజచేయటానికి తామర వత్తులతో తయారు కాబడిన ఐదు వత్తులను కంచు ప్రమిదెలలో వేసి వెలిగించాలి. దీపారాధనలో నేయిని ఉపయోగించాలి.
శుక్ర గ్రహ పూజలో కూడా తామర వత్తులతో తయారు చేసిన ఆరు వత్తులను వేసి వెలిగించాలి. దీపారాధనకు ఆవునేతిని వినియోగించాలి. శని గ్రహ పూజకు నల్లని ఏడు వత్తులను స్టీలు ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వినియోగించాలి.
ఇక రాహు గ్రహ పూజకు నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి. కేతు గ్రహ పూజలో తెల్లజిల్లేడుతో తయారు కాబడిన తొమ్మిది వత్తులను ఉపయోగించాలి. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇలా ఆయా గ్రహాల శాంతులకు పైవిధంగా దీపారాధన చేయడం ద్వారా జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు.