Monday, October 8, 2012

నవగ్రహాల శాంతికి ఎలాంటి వస్తువులు దానం చేయాలంటే?








నవగ్రహాల ఆధిపత్యంలో కష్టసుఖాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ నవగ్రహాలను శాంతి పరచడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఆయా గ్రహాధిపత్యంలో పుట్టిన జాతకులు తమ గ్రహాధిపత్య సంచారాన్ని అనుసరించి పూజ, దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

నవగ్రహ శాంతికి సంబంధించి జాతక ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవగ్రహాలకు ప్రీతికరమైన వస్తువులతో పూజ, దానాది కార్యక్రమాలను నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహ పూజలో భాగంగా గ్రహ శాంతికి, దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇందులో సూర్యగ్రహ శాంతి కోసం పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. ఈ జాతకులు చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహానికి పూజ నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల వీరికి అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం చంద్రుణ్ణి పూజించి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది.

ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చ ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.