Friday, November 30, 2012

పూజకు తర్వాత దేవుడికి పెట్టే నైవేద్యం ప్రత్యేకత ఏమిటి....!?







నైవేద్యమును "నివేదనమ్" అంటారు. మన మనస్సులోని విషయాన్ని సుఖదుఃఖాలను ఏవైనా వానిని గురించి సందేహాలుంటే, వాటిని స్వామికి నివేదించుకోవడమే నివేదనం. అన్నం, కూర, పప్పు, పచ్చడి, రకరకాల పిండి వంటలూ ఎంతో కష్టపడి చేసిన ఆహార పదార్థాలన్నింటినీ దేవునికి సమర్పించడాన్ని కూడా నివేదనం అంటారు.

నివేదన కోసం రోజంతా కష్టపడి, భక్తి విషయానికి వచ్చేటప్పటికీ ఓర్పు నశించి, మందగిస్తారు కొందరు. అలా మందగించడం ఎలాంటిదంటే చెట్టు మొదలు నరికి, నీళ్ళు పోయడం వంటిది అవుతుంది. "భగవాన్నోదక ప్రియః" అంటే దేవుడికి తిండి అంటే ఇష్టం కాదు అని అర్థం. అయితే నివేదనము అన్న మాటకు ఆత్మలోని విషయాన్ని నివేదించుకోవడమేనా అనే భావం కలుగుతుంది. అలా అయినప్పుడు దేవాలయంలో ఎప్పుడూ నివేదనలు ఎందుకు ఇస్తారు అనిపిస్తుంది.

ఈ నివేదనం సాకుతో ఏవో చేయడం కాదు. అసలు నివేదన రహస్యాన్ని అందరూ తెలుసుకోవాలన్న అర్థమే తప్ప దేవుడు తినాలనిగానీ, దేవుడు తింటాడనీ కానీ అర్థం కాదు. నివేదనం చేసాక దానినే "ప్రసాదం" అంటూ అందరికీ పంచి పెడతాము. ప్రసాదం అనే మాటకు అనుగ్రహం అని అర్థం.

దేవుడికి పెట్టిన ఆహారం అని కాదు "దేవా! నీ నివేదానికి సమర్పించినది, ఈ విధంగా మాకు ప్రసాదంగా లభించింది." అని పూజారి మనకా ప్రసాదాన్ని అందిస్తాడు. అంటే దేవుడికి నివేదిస్తే ప్రసాద సిద్ధి, అనుగ్రహ సిద్ధి ఉంటుందని పండితులు అంటున్నారు.