నైవేద్యం అంటే పండ్లూ, టెంకాయలూ ఇలాంటి కొన్ని తినుబండారాలు దేవునికి సమర్పిస్తుంటాం. ఇక మహా నైవేద్యం అంటే ఎక్కువ సంఖ్యలో రకరకాల పిండి వంటలను అందరికంటే ఎక్కువగా పెట్టాలనే ఆలోచనతో పెడుతుంటాం.
నిజానికి "నైవేద్యమ్" అంటే "ఆత్మనివేదనమ్". మనస్సును దేవుని ముందు పెడుతూ.. మన ఆత్మలో ఉన్న సర్వస్వాన్ని దేవునికి మౌనంగా నివేదించడమే నైవేద్యం అనే మాటకు అర్థం.
అయితే పండ్లు, ఫలహారాలు ఎందుకు పెడతారంటే.. ఇవి లౌకికమైన నైవేద్యాలు. మన ప్రాచీనులు లౌకికమైన పండ్లు, పిండివంచలనే నైవేద్యాలను ఆరోగ్యానికి సంబంధించిన రీతిలో ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి, ఉగాది తర్వాత ఎండాకాలంలో వస్తుంది. వేడిని తగ్గించడానికి, చల్లబరచడానికి వడపప్పు, పానకం శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి మనం తినడం, తాగడం చేస్తుంటాం. మంచి నడి వర్షాకాలంలో వినాయకచవితికి ఉండ్రాళ్ళు, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి మనం తీసుకుంటాం.
అటూ ఇటూ కాని ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి, పెరుగున్నం, పులిహోర నైవేద్యం పెట్టి మనం ఆరగిస్తాం. ఇవన్నీ శరీర ఆరోగ్యం కోసం చేసేవి. లౌకికమైన నైవేద్యాలు ఐహికమైనవి. ఆముష్మికమైన నైవేద్యం ఆత్మనివేదనమే.
ఎన్ని రకాల పిండివంటకాలూ, ఆర్భాటమూ, శరీరశ్రమా వీనిని మాని ఆరోగ్యరీత్యా ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ముఖ్యంగా దేవుడికి ఆత్మను నివేదించడం చేయాలి. దేవునిపై ఏకాగ్రత ప్రధానమని గుర్తించుకోవాలని పురోహితులు చెబుతున్నారు.