రాహుకాలంలో దుర్గాపూజ విశిష్టతను తెలుసుకోబోయేముందు రాహువునకు, దుర్గాదేవికి ఉన్న సంబంధమేమిటో తెలుసుకుందాం. పూర్వం కశ్యపముని భార్య అయిన సింహిక.. ఒకనాటి సంధ్యాసమయాన రతిని కోరి రమించినందువలన ఆమె గర్భాన రాహువు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
రాహువు సంధ్యారతి వలన రాక్షస గుణములతో ప్రవర్తించడమే గాకుండా శనీశ్వరుడికి ఆప్తమిత్రుడై సహవాసదోషం వలన చెడుపేరు సంపాదించుకున్నాడు. శనికి మిత్రుడు కావడంతో నలుపు, నీలిరంగు వస్త్రాలు, నువ్వులనూనె రాహువునకు అత్యంత ప్రీతికరమైన పదార్థములు, వస్తువులైయ్యాయని పురోహితులు చెబుతున్నారు.
అలాగే ఉగ్రదేవతల పూజల్లోనూ, వామాచార పూజల్లోనూ ముఖ్యంగా దుర్గా, రాహుగ్రహ పూజల్లో నిమ్మకాయను ఎందుకు వాడుతారంటే..?! దేవీభాగవతం ప్రకారం రాక్షకుడు రక్తబీజుని వధించేది ఎలా అని దుర్గాదేవి సతమతమవుతుండటం చూసిన సింహిక తన తనయుడు రాహువు భేద-తంత్ర విద్యలో నిష్ణాతుడని అతడ్ని సంప్రదించమంది. కానీ దుర్గాదేవీ ఆమె సలహాను వినక చండాముండీలను సృష్టించి రక్తబీజుని రక్తం నేలమీద పడనీయక చేసి, తద్వారా అతనికి పునర్జీవం ఉండదని, ఆ సమయంలో అతడి మాయలను చేధిస్తానని చెప్పింది.
దేవి ఆజ్ఞ ప్రకారమే చండాముండీలు చేసినప్పటికీ నేల మీద ఉన్న అనేక సూక్ష్మమైన రక్తబిందువుల నుంచి, భూమిలో ఇంకిపోయిన రక్తబిందువుల నుంచి వేలాది సంఖ్యలో రక్తబీజులు ఉద్భవిస్తూనే వచ్చి ఈ ముగ్గురమ్మలను (దుర్గా, చండీ, చాముండేశ్వరీ దేవిలు) చికాకు పరచసాగాయి.
అపుడు దుర్గాదేవి సింహిక సలహాను గుర్తుతెచ్చుకుని ఆవాహనం చేసింది. జగదంబ ముందు ప్రత్యక్షం అయిన రాహువు ఆమె చెప్పకమునుపే విషయాన్నంతా గ్రహించి, అమ్మా మీ ముగ్గురి శక్తుల్లో సహస్రాంశమును సన్నటి పొడవాటి రూపంలో నాకు అనుగ్రహించండి అని కోరాడు.
శక్తులు రాహువు కోరినట్లుగానే తమ శక్తులను రాహువునకు ప్రసాదించగా వాటిని అతడు తన నాభిని కేంద్రంగా చేసుకుని ఏకాదశ ఆధారాలను నిర్మించి, ఈ గదులలో ముగ్గురమ్మల శక్తిని చిన్న చిన్న కేశముల రూపంలో నిక్షిప్తం చేశాడు. వీటినే నిమ్మకాయలోని రసకేశములని అంటారని పురోహితులు చెబుతున్నారు.
అనంతరం రాహువు తానొక ఫలరూపంగా మారిపోయాడు. అపుడా ఫలాన్ని దుర్గ "నిమఊ" అనగా సంసిద్ధుడవు కమ్మని ఆదేశించి, తిరిగి రక్తబీజునితో యుద్ధం కొనసాగించింది. "నిమఊ" అనే పదానికి "తాంత్రికఫలం" అని అర్థం. ఈ పదమే కాలక్రమంలో నిమ్మ, నింబూ, నింబుకం అని ప్రఖ్యాతి చెందింది.
కాగా రక్తబీజుని రక్తం ఎక్కడ పడుతున్నదో అక్కడ ఈ "నిమఊ" ఉద్భవించి ఆ రక్తాన్ని తన దేహానికి అంటుకునే విధంగా పార్లుతూ, దొర్లుతూ రక్తమంతా అంటగానే తనంతట తానుగా వెళ్లి చాముండి నాలుకపై పడటం, దానిని ఆమె మింగివేయడం జరిగింది. ఈ విధంగా కొన్నివేల సంఖ్యలో ఈ "నిమఊ"ఫలాలు రక్తబీజుని రక్తాన్ని గ్రహించి ఆ దుష్ఠుని వధలో సహాయపడ్డాయి.
రాహువు చేసిన ఈ గొప్ప సహాయమునకు సంతుష్ఠురాలైన దుర్గా, చండీ, చాముండేశ్వరీ దేవిలు రాహువు నిమ్మకాయ రూపంలో తమ పూజల్లో ప్రధానమైన స్థానమును పొందగలడని వరం ఇచ్చారు. అంతేగాక రాహువు వలన ఏర్పడే దోషాలు అన్నింటి కూడా నిమ్మకాయ నైవేద్యం, నిమ్మదొన్నెలో, నువ్వులనూనెతో దీపారాధనం చేస్తే సత్వరమే నివారించబడతాయని అభయం ఇచ్చారు. అప్పటినుంచి వామాచార, ఉగ్రదేవతా పూజల్లోనూ, ఉపాశనల్లోనూ, నిమ్మకాయకు పూజార్హత లభించింది.
నిమ్మకాయలోని 11 ఆధారములు ఏకాదశ రుద్రులకు ప్రతీకలు. ఎక్కడ రుద్ర సంభూతం ఉంటుందో అక్కడ శక్తి కూడా ఉంటుందని చెప్పేదే లోపలున్న రసకేశములు. కాబట్టి నిమ్మదొన్నెలో దీపారాధనం చేసేటపుడు దానిని దొన్నెలా చేస్తారు. ఇలా దొన్నెలా చేసిన నిమ్మలో తన మిత్రుడికి ఇష్టమైన నువ్వులనూనెను పోసి దీపమెలిగిస్తే రాహు-శని దోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా కాలసర్పదోషము, గురుచండాలయోగం, పిశాచయోగము ఏర్పడినప్పుడు మంగళవారం రాహుకాలంలో నిమ్మదొన్నెలో నువ్వులనూనెతో దుర్గాలయంలో కానీ, శక్తి ఆలయాల్లో కానీ దీపారాధన చేసినట్లయితే నివృతి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.