Saturday, November 17, 2012

పాపాత్ములెవరు..?!! పుణ్యాత్ములెవరు...?!!!








జీవుడు పూర్తిగా పాపాన్ని గానీ, పుణ్యాన్ని గానీ ఒక్కదానినే ఎప్పుడూ చేయలేడు. వాని మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. అందుచేత సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి జీవితంలో.

సిరిసంపదలు, గానం, మృష్టాన్న భోజనం, గంధపుష్పములు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాభరణాలు, అనురాగవతి- అణకువ కల్గిన భార్య, శయ్యా సౌఖ్యం, అష్టభోగాలు పుణ్యఫలాన కలుగుతాయి. సత్సంతానము పుణ్యఫలమే అంటారు. వీటిని అనుభవించుచున్న మానవుని పుణ్యజీవి అంటారు.

దారిద్ర్యము, దేశాంతరగమనం, పరాన్నప్రతీక్షణం, ఉచ్ఛిష్ట భోజనం, భంగపాటు, భార్యా వియోగం, శత్రుస్నేహం, ఆపత్కాల బంధుదర్శనం అష్టకష్టాలు, దుష్ట సంతానం, అవయవలోపం కూడా దుష్కర్మ ఫలమే అన్నారు. వీటిని అనుభవించుచున్న మనుజుని పాపజీవి అంటారు.

పుణ్యజీవికి కష్టాలు, పాపజీవికి సుఖాలు ఉండకపోవు... కానీ అవి కూడా స్వల్పంగా ఉంటాయి. పాపికి పుణ్యలేశమే ఊరటకల్గిస్తుంది. పుణ్యాత్మునికి పాపలేశం క్లేశాన్ని కలిగించును. ఆ కారణాన విరక్తిని కలిగిస్తుంది.

జీవితంలో పుణ్యమెక్కువ చేసిన పాపమును, పాపమెక్కువ చేసిన పుణ్యమును హరించుకుపోవునని కొందరి అభిప్రాయము. ఇది సరికాదు. ఏ కర్మయైనా అనుభవించనిచో అది నశింపదు. కావున పాప ఫలములను అనుభవించి తీరవలసిందే. అందుకే " ప్రారబ్ధం భోగతే నశ్యేత్" అన్నారు పెద్దలు.