ఒక్కో ఆలయంలో ఒక్కో విధమైన పదార్థాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. తమకిష్టదైవమైన ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. శివుని ఆలయంలో బిల్వ పత్రాలు, వైష్ణవ ఆలయంలో తులసీ తీర్థాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ తీర్థాలను లేదా ప్రసాదాలను కొందరు తామే స్వయంగా తీసుకుంటారు.
మరికొందరైతే ఇంకొకరి చేతిలో ఉన్న కొంత ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటారు. కానీ ప్రసాదాలను ఆలయాల్లో ఎలా తీసుకోవాలనేది ఎక్కువ మంది భక్తులకు తెలియదు. ప్రసాదాలను స్వీకరించేటప్పుడు కూడా నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కాగా, ఆలయాల్లో ఇచ్చే చక్కెర పొంగలిని తీసుకునే భక్తులు కుడిచేతిలోనే ఉంచి నోటితో కొరికి తినడం చేస్తారు. అయితే ఇలా తినడం ద్వారా వచ్చే జన్మలో జంతువులుగా జన్మిస్తారని పురోహితులు చెబుతున్నారు. జంతువులే నోటితో కరిచి తింటాయి.
అందుచేత చక్కెర పొంగలి ప్రసాదాన్ని కుడిచేతిలో తీసుకుని దాన్ని ఎడమచేతిలోకి చేర్చి, కుడిచేతితో కొంచెం కొంచెం నోటిలో వేసుకోవాలి. ఇంకా తీర్థ ప్రసాదాలను స్వీకరించేటప్పుడు ఎడమ చేతిపై కుడిచేతిని ఉంచి అరచేతిలో తీర్థాన్ని తీసుకోవాలి. అరచేతిలో దేవతలుంటారని విశ్వాసం. అందుకే నిద్రలేచిన వెంటనే అరచేతిని చూడాలని పురోహితులు చెబుతున్నారు.