Sunday, December 2, 2012

కొత్త పెళ్లి కూతురు కాలితో బియ్యాన్ని నెట్టడం ఎందుకు....!?






భారతదేశం సంప్రదాయాలకు ఆయువుపట్టు. భారతీయ సంస్కృతిని బట్టి వివాహం అనేది ఓ గొప్ప తంతు. ఇలా కొత్తగా పెళ్లయిన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. ఈ సంప్రదాయంలోని అర్థమేమిటో మీకు తెలుసా అయితే ఈ కథనాన్ని చదవండి.

ఉత్తర భారత దేశంలో ఈ పద్ధతి ఉంది. కానీ దక్షిణ భారత దేశంలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపించదు. కొందరైతే బియ్యమో లేదా వరితో నిండిన చిన్నపాటి బిందెను కొత్త పెళ్లికూతురు కాలితో నెట్టించి లోనికి తీసుకొస్తారు. కొత్త పెళ్లి కూతురు పూజ గది వరకు నడిచే విధంగా పట్టు వస్త్రాన్ని పరచడం చేస్తారు.

అందులో కొత్త పెళ్లి కూతురు నడవటం, ఆమెను మహాలక్ష్మిగానే భావించడం ఐతిహ్యం. పూర్వం కోడలు ఇంటికి వస్తుందంటే మహాలక్ష్మినే ఇంటికొస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొత్త పెళ్లి కూతురుని అత్తగారింటికి తీసుకెళ్లి దీపమెలిగించడం చేస్తున్నారు.

చేతిలో కామాక్షి దీపంతో కొత్త పెళ్లికూతురు అత్తగారింట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వస్తుందని భావిస్తారు. అలాగే లక్ష్మీ నివాసముండే వరి, బియ్యంను ఒక చిన్నపాటి కలశంలో ఉంచి దానిని నెట్టుకుని కొత్త పెళ్లికూతురు గృహంలోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకువచ్చినట్లవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కొత్త పెళ్లికూతురు కాలుపెట్టిన ఆ సమయం నుంచి లక్ష్మీ కటాక్షం ఆ గృహానికి లభిస్తుందని వారు అంటున్నారు.