ఓటమి నుండి ఓంకారమునకు :
నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు.
అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ బాబా మరింత విరాగిగా ఉండిపోయారు. అప్పటి నుంచి సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. ధోవతీలను మానేశారు. లంగోటా బిగించుకుని పైన పొడవైన తెల్ల చొక్కా ముతకది ధరించేవారు. తలకొక గుడ్డను కట్టుకుని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు చుట్టుకునే వారు.
అప్పటి దాకా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేయడం, రోగులకి ఉచిత వైద్యం అందించడం, దెయ్యాల వలన, గ్రహదోషాల వలన పీడించబడేవారిని కాపాడటం, ఇటువంటి వాటివల్ల షిరిడీలో ఆయన ``మంచివాడు'' అనీ, పరోపకారస్ధుడనీ పేరు పడ్డారు. ఆయననెంతగా ఆరాధించినా బాయ్‌జాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తము్మడే. ఆమె కుమారుడు తాత్యాకు మేనమామే. మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి, అవతారపురుషుడూ సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు.
అద్భుతయోగం - ధౌతి :
యోగ అభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను మూడు అంగుళాల వెడల్పూ, ఇరవైరెండున్నర అంగుళాల పొడవు వుండే గుడ్డను మింగి ఒక అరగంట సేపు దానిని కడుపులోనే ఉండనిచ్చి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. ఈ యోగ విద్యను ``ధౌతి'' అంటారు. సాయిబాబా కూడా ఇలాంటి ``ధౌతి''ని చేసుకునేవారు. కాని, వారి ధౌతీ చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు రవంత ఎడంగా ఒక బావి ఉంది. ఒక రోజున సాయిబాబా ఆ బావి దగ్గర తను ధౌతీని నిర్వహించారు. అది గుడ్డ మింగడం కాదు. సరాసరి తమ ఊపిరితిత్తలను బయటకు కుక్కి, నీళ్ళతో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్ళీ తనలోకి అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన ధౌతీని కొందరు ప్రత్యక్షంగా చూడడంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్యయోగం.
ఖండయోగం :
ఒక విశ్రాంతి రోజు రాత్రి, శ్రీ సాయిబాబా తమ శరీర అవయవాలు అన్నిటినీ కాలికి కాలు, చేయికి చేయిగా వేరు చేసి మసీదులోని వేరు వేరు స్ధలాలలో వుంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాభిల్ తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్ళి, చెల్లాచెదురుగా పడివున్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరో ఖండఖండాలుగా నరికేశారని ఊహించాడు. కాని ఆ సంగతి తను బయటపడితే నేరం తన మీద పడుతుందేమోనన్న భయంతో మౌనంగా వుండిపోయాడు. మర్నాడు మసీదుకు వెళుతున్న జనంతోపాటు తాను కూడా ఏమీ తెలియని వాడి లాగానే వెళ్ళాడు. తీరావెళ్ళే సరికి బాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాభిల్ నోరు వెళ్ళబెట్టాడు. బాబా చిరునవు్వ నవు్వతూ ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి ``భయపడకు బ్రతికే వున్నానులే'' అని వెన్ను తట్టే వరకు అతని పరిస్ధితి అయోమయమే. అనంతరం అసలు విషయమేమిటని కొందరు ప్రశ్నించడంతో ఆ అప్పాభిల్ క్రితం రోజు తను చూసిన దృశ్యాన్ని తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్నే ``ఖండయోగం'' అంటారు.
లాకోత్తర యోగ సమాధి-శవాసనం :
ఇంకొకసారి అంటే 1886 సంవత్సరం, ఆగస్టు 13వ తేదీ రాత్రి వేళ, మహాల్సాపతిని పిలిచి, ``మహల్సా! ఈ శరీరాన్ని మూడు రాత్రుళ్ళు పాటు కాపాడు. తిరిగి వచ్చానా సరేసరి, లేకపోతే మూడు రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదు కెదురుగా వున్న ఖాళీ స్ధలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలని గుచ్చిపెట్ట''మని చెప్పి అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేలమీద శవాసనం చేసి వుండిపోయారు శ్రీ బాబా. క్రమంగా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడటం మానేసింది. అసలే సాయిబాబా వేసినది శవాసనమేమో నాడీ, ఊపిరీ నిలిచిపోయే సరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది. మహాల్సాపతి అక్కడి నుంచి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి కాపలదారుగా అక్కడే ఉండిపోయాడు.
తెల్లవారింది. ఎప్పటిలాగానే బాబా దర్శనమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేబరంలా కనిపించారు. వాళు్ళ కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా పాకింది. ఊరి పెద్దలొచ్చారు మసీదుకి. వాళ్ళతోపాటు ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టరు బాబా శరీరాన్ని పరీక్షించాడు. ``బతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు. ఇతను చచ్చిపోయాడు. అతని ఆత్మ, శాంతి మాయమై విశ్రాంతి పొందునుగాక'' అని చెప్పాడన్నమాట. ఇంకేముంది మనం నిజంగా బతికే వున్నా కూడా డాక్టరుగారు మనం మరణించామని ధృవీకరిస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబారానికీ ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు. కాని మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకుని ఆ జనాలకు అడ్డం పడ్డాడు.
`` ఈ శరీరాన్ని మూడు రాత్రులు పాటు కాపాడమని సాయి చెప్పాడు. అందువల్ల మూడోరాత్రి గడిచేదాక నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరమైతే నన్ను కూడా సజీవ సమాధో, సజీవదహనమో చేసెయ్యండి'' అని భీష్మించాడు. దానితో ఈ గొడవ అహ్మదాబాదు జిల్లా కలెక్టరు దాకా వెళ్ళింది. ఆయన ఇంగ్లీషాయన. ``శ్రీ సాయిబాబా చెప్పినట్లు మూడు రాత్రులు ఆగే తీరా''లన్న ఆయన భక్తులవాదాన్నీ, డాక్టర్ సర్టిఫికెట్ కారణంగా అది శవమే కాబట్టి, వెంటనే అంత్యక్రియలు చేయాలి అన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన `` ఆగవలసింది మూడు రాత్రులేగదా! మీ గొడవల మధ్యన రెండు రాత్రులు ఎటూ అయిపోయాయి. ఇంకొక్క రాత్రి ఆగండి. తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి. ఒకవేళ ఆ ఫకీరు బతికితే మాత్రం వెంటనే నాకు తెలియజెయ్యండి. డాక్టర్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బతకడం అసాధ్యం. అది ఒక్క ఏసుక్రీస్తుకే సాధ్యమైంది. బతికితే ఈయన కూడా అంతటివాడే'' అన్నాడు కలెక్టరు.
దాంతో రెండు వర్గాల వారూ కలహాలు మానేశారు. తెల్లారగా సాయిబాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో వున్నారు కూడా - అంతర్యుద్ధాలు మాత్రం జరగలేదు. మూడు రాత్రులూ గడిచాయీ అనగానే అంటే ఆగస్టు 16 తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేళప్పుడు సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది. నాడి ఆడటం ప్రారంభమైంది. శవంలా పడి వున్న కళేబరం సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులూ లేవు.సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలూ లేవు. సాయిబాబా పునర్జీవితులయ్యారన్న వార్త కలెక్టరుకు అందింది. ``అయితే సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే'' అని చెప్పారాయన. దీన్ని బట్టి సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతోంది గదా! అంతేకాదు ఈ నాటి సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప యితరం కాదు. ఈ క్షణానికీ ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే వున్నారు. తనకై తపించే భక్త కోటికి, వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే వున్నారు. శరణాగతులకు ఎనలేని సహాయసహకారాలని అందిస్తూనే వున్నారు. కావలసినదల్లా సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే.