Saturday, June 22, 2013

శ్రీ సాయిమహిమ ......!







అప్పుడప్పుడు శ్రీ సాయి నీంగావ్‌లోని డేంగలే సోదరులు యిళ్ళకు వెళుతుండేవారు. వారిలో చిన్న వాడైన నానా సాహెబ్‌ రెండు పెళ్ళిళు్ళ చేసుకున్నా కూడా సంతానం కలగలేదు. ఒకసారి అతను తన బాధని శ్రీ బాబా ముందు వెళ్ళబోసుకోగా దయామయులైన శ్రీ సాయి ``కొడుకుల్ని కను'' అని దీవించారు. ఎందరో వైద్యుల చేత కూడ కాని పని బాబా ఆశీర్వచన బలం వల్ల పండంటి సంతానం కలిగింది. మసీదులో వెలిగించిన నీటిదీపాలు, డేంగలేకిచ్చిన ఈ దివ్య ఆశీస్సు వల్ల సాయిబాబా కీర్తి నేల నాలుగుదిక్కుల వ్యాపించింది.

తంబోలీ :
శ్రీ సాయిబాబా తమ వేషాన్ని మార్చారు. తెల్లటి తలపాగా, తెల్లటి అంగీ, తెల్లటి ధోవతి ధరిస్తుండేవారు. దినచర్య మాత్రం మారలేదు. శ్రీ సాయిబాబా షిరిడీలో నివాసమేర్పరచుకునే నాటికి ఆ వూరిలో ప్రసిద్ధుడైన మరో వ్యక్తి ప్రముఖ వస్తాదు తంబోలీపహిల్వాన్‌. ఇతను తాయెత్తులూ అవీ అము్మకుంటూ వుండేవాడు. ఊరిలో వాళ్ళకి జ్వరాలు వచ్చినా, దెయ్యాలు పట్టినా ఇతనినే ఆశ్రయించేవారు. వాళ్ళదగ్గర బాగా డబ్బు గుంజుకుని, తాళూ్ల తాయెత్తులూ కట్టేవాడు. షిరిడీలో ఇతనో గొప్పభూత మాంత్రికుడుగా చెలామణీ అవుతుండేవాడు.

కాని సాయిబాబా షిరిడీలో నివసించడం ఇతని వ్యాపారానికి ఆటంకంగా పరిణమించింది. ఊరి వాళ్ళ జబ్బులనీ, భూతప్రేత పిశాచ గ్రహాల వలన బాధలని శ్రీ సాయిబాబా ఉచితంగా వదలగొడుతూ వుంటే ఇక తంబోలీని ఆశ్రయించి డబ్బు లెవరిస్తారు? భోజనం హోటలు పక్కనే నిరంతరం అన్నదాన సత్రం పెడితే ఆ హోటలు యజమాని పని దివాళయే కదా! ప్రస్తుతం తంబోలి పరిస్ధితి అలాగే తయారైంది. దీనితో తంబోలికి బాబాపై ద్వేషం ఏర్పడింది. ఇద్దరి మధ్య నగను రెచ్చగొట్టేందుకు ఎందరైనా వుంటారు కదా... ఆ విధంగా తంబోలిలో శ్రీ సాయిపై కక్ష దినదిన ప్రవర్ధమానంగా వచ్చింది. సద్గురు శ్రీ షిరిడీ సాయినాథునికి త్రికరణశుద్ధిగా వినమ్రుడినై అనంతమైన వారి లీలలో ఒక దానిని ఈ ఘట్టానికి అన్వయింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  


షిరిడీ గ్రామస్ధులలో ఒకనొకరికి దెయ్యం పట్టింది. వాళ్ళ అలవాటు ప్రకారం వాళు్ళ తంబోలీని ఆశ్రయించారు. కాని, ఫక్తు వ్యాపారస్దుడైన తంబోల్‌ వారి నుంచి అధిక ధనాన్ని ఆశించాడు. అంత సొము్మ వారి దగ్గరలేదు. ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్న వారికి - ఏ మహాల్సాపతి వంటివాడు ఎదురై - మసీదులో ఉన్న శ్రీ సాయిబాబాని ఆశ్రయించవలసిందిగా హితవు చెప్పాడు. వాళ్ళలాగే శ్రీ బాబాని ఆశ్రయించారు. శ్రీ బాబా ఒక కొబ్బరికాయను తెప్పించి - దెయ్యం పట్టిన వ్యక్తికి దిగదుడిచారు. అలా దిగదుడుస్తూనే అతని చెవిలో ఏదో చెప్పారు. ఏం చెప్పారో ఎవరికీ వినపడనే లేదు. దిగదుడిచిన కొబ్బరికాయను పగుల గొట్టించగానే దెయ్యం దిగిపోయింది. ఆ వ్యక్తి యధాప్రకారం ఆరోగ్యవంతుడయ్యాడు. 
 
ఈ సంగతి ఊరిలో ప్రచారమైంది. శ్రీ సాయిబాబాకు ఎనలేని ఖ్యాతి కలిగింది. కాని తంబోలీకి కంటకంగా పరిణమించింది. కొందరు దుష్టుల సలహాపై తంబోలీ ఒక నాటకం ఆడాడు. తనకే దెయ్యం పట్టినట్లుగా నటించాడు. అతని వర్గం మనుషులంతా కల్సి, అతన్ని సాయిబాబా ముందుకు తెచ్చారు. దెయ్యాన్ని దింపమన్నారు. అలాంటప్పుడు బాబా అతని చెవిలో మంత్రం చెప్పాలి కదా! ఆ మంత్రం తెలుసుకోవాలనే ఇంత నాటకమన్నమాట. కాని, శ్రీ సాయిబాబాకు తెలియదా వాళ్ళ నాటకం! మనుషుల హృదయాలలోనే కాదు, సృష్టిలోని సమస్తమైన పశుపక్షి క్రిమికీటకాల మనోగత - భావాలనూ ఇట్టే పసిగట్టగల సాయినాథునికి ఇలాంటి తమాషాలు లెక్కలోనివి కాదుగదా!

అందుకనే ఆయన... దెయ్యాన్ని దింపేందుకుగాను భూతమాంత్రికుల పద్ధతినే ప్రయోగించారు. ఛెళు్ళఛెళు్ళన ఈ చెంపా ఆ చెంపా వాయించి వదలిపెట్టారు. దాంతో అప్పటిదాకా తమాషా చేస్తున్న తంబోలీ అహంకారంతో తిరగబడ్డాడు. ``కేవలం షిరిడీలోని నాలుగు గడపలలో బిచ్చమెత్తుకుని బ్రతుకే ఒక ఫకీరు తన మీద చెయ్యి చేసుకోడమా?'' అని హుంకరించాడు. అతనితో వున్న అతని వర్గీయులందరూ తంబోలీనే బలపరిచారు. న్యాయానికి ప్రధానమైన సాక్ష్యం తంబోలీ వైపునే తప్ప - శ్రీ సాయి వైపున లేకపోయింది. అయినా శ్రీ సాయి చలించలేదు.

`దానికేముంది? ఒక్కొక్క దెయ్యాన్ని ఒక్కొక్క రకంగా దింపుతాము. బలులూ, చింతబరికెలతో చిత్రహింసలూ, మంత్రాలూ, తాయెత్తులూ రకరకాలు అందులో ఇదో పద్ధతి. ఇప్పటిదాకా తను సైతాను మనిషి, ఇప్పుడు తంబోలీ నంటున్నాడు. మొత్తం మీద దెయ్యం దిగిపోయింది గదా! అంటారు శ్రీ సాయిబాబా. కాని తంబోలీ వర్గం వాళ్ళెవరూ ఊరుకోలేదు. ఆ వూరిలో పుట్టి ఆ ఊరిలో పెరిగిన తనని, తన వాళ్ళ మధ్య చెంపదెబ్బ కొట్టడం - తల కొట్టడం కన్నా అవమానంగా భావించాడు తంబోలీ. తనని కొట్టేపాటి బలవంతుడైతే తనతో కుస్తీకి దిగమన్నాడు. ఆ ఊరిలో తనో, బాబాయో ఎవరో ఒకళ్ళే వుండాలన్నాడు. కుస్తీలో ఓడిపోయినవాళు్ల షిరిడీ వదిలి వెళ్ళిపోవాలన్నాడు. అతని వత్తాసుగాళ్ళందరూ ``సై'' అన్నారు. మహాల్సాపతి ప్రభృతులు ``అన్యాయం'' అని చెప్పినా ఎవరూ వినలేదు. చుట్టుపక్కల పరగణాలలో పెద్ద వస్తాదుగా పేరు మోసిన తంబోలీ పహిల్వానుకీ - సాధూ సాయినాథులకూ కుస్తీ జరగక తప్పదన్నారు. సాయిబాబా కుస్తీకి సిద్ధపడ్డాడు. మహాల్సాపతి వంటి భక్తులెందరో ఆయనను ఆపాలని ప్రయత్నించారు. కాని, బాబా వారి మాటలను తోసిపుచ్చారు.