మనిషి
చేతిలోని బొటన వేలు చాలా గొప్పదైనది. దీని గొప్పదనం తెలుసుకునే అర్జునుని
గురువైన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా స్వీకరించాడు.
దీంతో అర్జునుడిని మించిన విలువిద్యకారుడు ప్రపంచంలో మరెవ్వరూ లేరంటే
అతిశయోక్తికాదు. బొటన వేలుకు మెదడుకు సంబంధం ఉంది. ఎందుకంటే మనిషి
చేయాలనుకున్న ప్రతి పనికూడా మెదడునుంచే సంకేతాలు అందుతాయి. కాబట్టి మనిషి
బొటన వేలును చూసి ఆ మనిషియొక్క స్వభావం, గుణగణాలు, అతని అలవాట్లు తదితరాలను
చెప్పవచ్చంటున్నారు జ్యోతిష్యులు.
బొటన వేలుకు సంబంధించినంతవరకు మూడు భాగాలుగా విభజిస్తారు :-
1** అగ్ర భాగం,
2** మధ్య భాగం,
3** అధో భాగం.
మనిషియొక్క బొటన వేలు అగ్ర భాగం సునాయాసంగా వెనుకవైపుకు వంగిపోతుంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం డబ్బు, సమయానికి విలువ ఇచ్చే రకం కాదంటున్నారు జ్యోతిష్యులు. ఇలాంటి వ్యక్తులు ఎదుటివ్యక్తులకు అనుగుణంగా తమనుతాము మలచుకుంటుంటారు. వీరు మంచి వ్యక్తులతో మంచిగా, చెడ్డ వ్యక్తులతో చెడుగా ప్రవర్తిస్తుంటారు.
బొటన వేలు చక్కగా, నిటారుగా ఉండి కాస్త పొట్టిగా ఉండే వ్యక్తుల స్వభావం ఏంటంటే... తమకు జరిగిన అన్యాయం, అవమాన భారాన్ని వీరు తప్పకుండా పగ తీర్చుకునే స్వభావులై ఉంటారని జ్యోతిష్యులు అంటున్నారు.
దృఢమైన, పొడవైన బొటన వేలు కలిగిన వారిని మనం సాధారణంగా సైనికాధికారులలో చూస్తుంటాము. ఇలాంటి వ్యక్తులు నీతిమంతులుగానూ, కర్తవ్యపరాయణులై ఉంటారు.
మెత్తగా, మృదువుగా ఉండే బొటనవేలు కలిగి వెనకకు వంగే స్వభావం ఉన్న వ్యక్తులు అందరినీ ప్రేమించేగుణం వీరిలో ఉంటుంది. కాని ఎవరితోనైనా మనస్పర్థలు వస్తే వారితో జీవితాంతం మాట్లాడరు.
ఇలాంటి వ్యక్తులు మానసికంగా బలహీనంగా ఉంటారు. వీరు తరచూ ఏడుస్తూ ఉంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు. వీరికి తెలిసిన ఏ చిన్న విషయంకూడా దాచిపెట్టలేరు. వెంటనే ఇతరులకు చెప్పేయాలని ఉబలాటపడుతుంటారు. వీరి జీవితం ఓ తెరచిన పుస్తకం లాంటిది. వీరు భావుకులుగాను, దయార్ద్రహృదయులై ఉంటారు.
ఇలా బొటనవేలుతోపాటు మెదడుకు సంబంధించిన రేఖ మంగళరేఖపై పయనిస్తుంటే వీరంతటి కఠినాత్ములు మరొకరుండరు. అదే మెదడుకు సంబంధించిన రేఖ చంద్రునిపై పయనిస్తుంటే వీరు ఏకాంతప్రియులై ఉంటారని జ్యోతిష్యులు చెపుతున్నారు. ఇలాంటి వారు తమ జీవితంలో నియమనిష్టలతో పనిచేస్తు, సిద్ధాంతాలను నమ్ముకుని ఉంటారనికూడా వారు చెపుతున్నారు.
ఒకవేళ వ్యక్తి యొక్క బొటనవేలు అగ్రభాగంనుంచే దృఢంగా ఉండి వెనుకకు వంగనిదై ఉంటే, ఇలాంటివారు అత్యధికంగా వ్యావహారికంగా ఉంటారు. వీరి కోరికలు బలీయంగా ఉంటాయి. వీరు వేసే ప్రతి అడుగులోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
ఇలాంటివారు
తమ లక్ష్యంకోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అలాగే తమ జీవితంలో ఏవరైనా
శత్రువులుంటే వారిని మట్టుబెట్టేంతవరకు వీరు నిద్రపోరని జ్యోతిష్యులు
అంటున్నారు.
ఒకవేళ బొటనవేలు కాస్త పొడవుగా, కూసుగా ఉంటే వీరు చాలా తెలివైనవారు. దీంతోపాటు వీరు స్వార్థపరులై ఉంటారు. అదే బొటనవేలు అగ్రభాగం గోరున్న భాగం చిన్నదిగా ఉండి వేలులోని అధోభాగం అరచేతిలో కలిసిపోయివుండి ఆ భాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటే, ఇలాంటి వ్యక్తుల్లో రతిక్రియపై ఆశక్తి మెండుగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. అదే ఇలాంటి చేయి మహిళకుంటే పరపురుషుల వశమవుతారని జ్యోతిష్యులు చెపుతున్నారు.
బొటనవేలు అగ్రభాగం లావుగా, మొరటుగాఉండి గోరు అణగారిపోయిఉంటే, ఇలాంటి వ్యక్తులు చాలా కోపోద్రిక్తులుగా ఉంటారు. అదే బొటనవేలు అగ్రభాగం గదలాగా ఉంటే వీరికి కోపం వచ్చినప్పుడు ఉచితానుచితాలను మరచి ఎవరినైనా హత్య చేసేందుకుకూడా వీరు వెనుకాడరంటున్నారు జ్యోతిష్యులు.
బొటనవేలు మధ్యభాగం అంటే గోరునుంచి క్రిందనున్న భాగం పొడవుగా ఉంటే, ఇలాంటి జాతకులు ఎవ్వరినికూడా నమ్మరు. అందరూ చెప్పే మాటలు వింటారు. కాని తన మనసుకు తోచింది మాత్రమే వారు చేస్తారు. అదే రెండవ(మధ్య)భాగం పెద్దదిగా ఉండేవారు తర్కస్వభావులై ఉంటారు. అదే భాగం పొట్టిగా ఉంటే ఈ జాతకుడు తర్కించే స్వభావం కలిగి ఉండరు. అలాగే ఈ భాగం అత్యంత చిన్నదిగా ఉంటే ఈ జాతకుని జీవితంలో అభివృద్ధి అంటూ ఏదీ జరగదు, కాని వీరు ముందు ఏపనైనా చేసేసి ఆ తర్వాత ఆలోచిస్తారంటున్నారు జ్యోతిష్యులు.
బొటనవేలు గుండ్రంగా ఉంటే వారు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు కలుగుతుంటాయి. అప్పుడప్పుడు వీరి బొటనవేలు చివరి భాగంలో గుంతలాగా ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులు రెండు వివాహాలు చేసుకుంటారు. వీరి స్వభావం ఇతరులను అనుమానించేదిగా ఉంటుంది. ఇలాంటివారికి కోపమొస్తే వీరు తమనుతాము ఆత్మహత్య చేసుకోవడానికికూడా వెనుకాడరంటున్నారు జ్యోతిష్యులు. వీరికి అమితమైన కోపంవస్తుంటుంది. దీంతో ఇంట్లోని పరిస్థితి గందరగోళంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
అదే చెయ్యి గులాబీ రంగులో ఉండి, వారి మెదడుకు సంబంధించిన రేఖ చిన్నదై, వేళ్ళు పలుచగా ఉంటే, ఇలాంటి వారి వ్యవహారం కుశలపూర్వకమైనది, ముందూ వెనుకా ఆలోచించే స్వభావం కలిగినవారుగా ఉంటారు. ఇలాంటి వారి కుటుంబ జీవితంకూడా ఆనందమయంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.